సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ): డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతుల కల్పనపై జీహెచ్ఎంసీ మీన మేషాలు లెక్కిస్తున్నది.. డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉండలేకపోతున్నామని లబ్ధిదారులంతా గడిచిన రెండేండ్లుగా అటు జీహెచ్ఎంసీ ప్రజావాణి, ఇటు వరుస ఆందోళనలు చేపడుతున్నా.. పెడచెవిన పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీసరమండలం అహ్మద్గూడలో రూ.1.80కోట్లతో లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తూ పనులకు టెండర్లను ఆహ్వానించారు. అయితే ఇక్కడ దవాఖాన, స్కూల్, నీటి సౌకర్యంలేక లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నా..సౌకర్యాల కల్పనలో జాప్యం చేస్తున్నారని అసోసియేషన్ నేతలు ఆరోపిస్తున్నారు. మిగతా డబుల్ ఇండ్ల వద్ద కూడా ఇదేపరిస్థితి ఉందని విమర్శలున్నాయి.
నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న బలమైన సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 111 లొకేషన్లలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. ఇందులోభాగంగానే ఉన్న చోటే 27 ప్రాంతాల్లో (ఇన్సైట్)లో 5,363 మందికి, 39 లొకేషన్లలో 63,478 మంది లబ్ధిదారులకు గృహాలను అందజేసిన సంగతి తెలిసిందే. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో 66 లొకేషన్లలో మొత్తం 68,841 మందికి పట్టాలు అందజేశారు. అయితే కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. కొన్ని చోట్ల కరెంట్ కనెక్షన్, కేబుల్ నెట్వర్క్, ఇంటర్నెట్, ఇతర మెయింటనెన్స్ పనులు పెండింగ్లో ఉన్నాయి.
ఈ మౌలిక వసతుల కల్పనలో రాజీపడకుండా కేసీఆర్ సర్కారు హెచ్ఎండీఏ నుంచి రూ. 100 కోట్లను జీహెచ్ఎంసీకి బదలాయించింది. నిబంధనల ప్రకారమే జీహెచ్ఎంసీ ఖజానాలోకి రూ.100 కోట్లు వచ్చి చేరాయి. కానీ నేటికి ఈ నిధులు ఖజానా నుంచి నిర్వహణకు మళ్లలేదు. పైగా డ్రైనేజీ, నల్లా కనెక్షన్ వేసిన జలమండలికి నిధులు మంజూరు చేయలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లకు తాజా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. అయితే రూ. 100కోట్ల నిధులను ఎలా సమకూర్చుకొని మౌలిక వసతుల కల్పనకు ఎలా కృషి చేస్తారన్నది స్పష్టత లేదు. మొత్తంగా మరిన్ని నెలలు లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది.
కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 66వేలకు పైగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటినా ఆ ఇండ్ల సముదాయాల్లో మంచినీరు, కరెంటు, రోడ్డు సదుపాయాలు కల్పించలేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో లిఫ్టులు పనిచేయడం లేదని, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున పిల్లల చదువులకు ఆటంకం కలుగకుండా చూడాలని, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించి డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. దీంతో పాటు వాటర్ సరఫరా, డ్రైనేజీ , లిఫ్టులు, కరెంట్, రహదారులు, ఇతర సదుపాయాల పనులకు టెండర్లు పిలుస్తున్నామంటూ.. కాలయాపన చేస్తున్నారే తప్ప..ఆచరణలో మాత్రం పనులు జరుగుతున్న దాఖలాలు లేవని లబ్ధిదారులు మండిపడుతున్నారు.