మేడ్చల్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ): ఆస్తి పన్నుల మదింపుపై కసరత్తు చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని విలీన మున్సిపాలిటీలతో పాటు కొత్త సర్కిళ్లలో అసెస్మెంట్ సర్వే ఈ నెలాఖరు వరకు పూర్తి కానుంది. దీంతో ప్రజలపై ఆస్తి పన్నుల భారం పడనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెంపునకు వివిధ రకాల పన్నుల ఖరారు లక్ష్యంగా పన్ను పరిధిలో లేని అంతస్తుల భవనాలను గుర్తించి ఆస్తిపన్ను ముదింపు చేసేందుకు టౌన్‌ప్లానింగ్ విభాగం కసరత్తును ప్రారంభించింది.
జిల్లాలోని ఎల్లంపేట్, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలతో పాటు ఇటీవలే ఎంఎంసీ, సీఎంసీల కార్పొరేషన్లలో కొత్తగా ఏర్పడిన సర్కిళ్లలో ఆస్తిపన్ను మదింపునకు మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు,ఉద్యోగులు అసెస్మెంట్పై ఇళ్లు, బహుళ అంతస్తులు, వ్యా పార, వాణిజ్య స్థల భవనాలపై సర్వే నిర్వహిస్తున్న విషయం విదితమే. మున్సిపాలిటీలు, కొత్త సర్కిళ్లలోఅనుమతులు లేని బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలను ఇప్పటికే గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రికార్డుల పరంగా ఉన్న ఇళ్లకు వాస్తవంగా ఉన్న నిర్మాణాలకు వ్యత్యాసం ఉండటంతో ఆ దిశగా లెక్కింపు పక్రియను చేపట్టారు. గతంలో ఇచ్చిన అనుమతులకు మించి అధికంగా అంతస్తులు ఉన్న రికార్డుల్లో నమోదు కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గుర్తింపు రికార్డుల్లో అనుమతి లేని నిర్మాణాలు అని తేలితే అ భవనం ఎప్పుడు నిర్మించారన్న రికార్డులను పరిశీలించి అ వివరాల మేరకు అప్పటి నుంచి ఆస్తి పన్నులు రాబట్టేలా అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.