బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కల్యాణోత్సవం ఆషాఢమాసం తొలి మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఎదుట త్రిశూల రూపంలో ఉన్న స్వామి వారికి, ప్రత్యక్ష దేవి రూపంలో ఉన్న ఎల్లమ్మ అమ్మవారికి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణం జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్వామి వారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. రాత్రి 8 గంటల వరకు దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 10 లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
– అమీర్‌పేట్, జూన్ 20
అమీర్‌పేట్, జూన్ 20 : ఆషాఢ మాసం తొలి మంగళవారం త్రిశూల రూపంలో ఉన్న స్వామి వారికి, ప్రత్యక్ష దేవి రూపంలో ఉన్న ఎల్లమ్మ అమ్మవారికి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఎదుట నిర్వహించిన వార్షిక కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. కండ్లు చెదిరేలా తీర్చిదిద్దిన వేదిక మీద స్వామి వారు, అమ్మవార్ల నూతన విగ్రహాలు ఏర్పాటు చేయడంతో వేదిక దేవతామూర్తులతో వెలిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కుటుంబ పరంగా మంత్రి కుటుంబసభ్యులు అమ్మవారికి, స్వామి వారికి పట్టు వస్ర్తాలను సమర్పించుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఎల్లమ్మ కల్యాణం వైభవంగా జరిగింది.
అమ్మవారి కల్యాణాన్ని సాధారణ భక్తులు, దాతలు, అధికార, అనధికార ప్రముఖులు సహా అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. దేవాలయ ఆవరణలో నిర్మించిన రెండు షెడ్లలోనూ కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఉదయం 4గంటల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారితోపాటు చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు కేతినేని సరళ, కొలను లక్ష్మిరెడ్డి, మమేశ్వరి శ్రీహరిలతోపాటు మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ పాలక మండలి చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, పాలక మండలి సభ్యులు ఉన్నారు.
క్యూలైన్లపై మంత్రి ఆరా..
అమ్మవారి కల్యాణం జరుగుతుండగా.. మంత్రి తలసాని లేచి వచ్చి భక్తుల క్యూలైన్ల గుర్తించి ఆరా తీశారు. అక్కడే ఉన్న మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, బీఆర్ఎస్ నాయకుడు అశోక్‌యాదవ్, పాలక మండలి సభ్యులు సుబ్బరాజులను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో క్యూలైన్లో ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న ఓ చిన్నారికి మంత్రి స్వయంగా నీళ్ల బాటిల్ అందించారు.
ఉదయం 7.30కే లక్ష మంది..
దేవాలయం నుంచి ఫతేనగర్ వైపు రెండు వరుసల సాధారణ భక్తుల క్యూలైను, వీవీఐపీ భక్తుల క్యూలైను ఒకటి, ఎస్ఎస్ బేకరీ వైపు రెండు వరుసల సాధారణ భక్తుల క్యూలైన్లు, రూ.50 టికెట్ భక్తుల క్యూలైన్ ఏర్పాటు చేశారు. పోలీసు అదికారుల అంచనా ప్రకారం ఉదయం 7.30 గంటలకే లక్ష మంది దర్శనాలు చేసుకున్నట్లు తెలిసింది.
అడుగడుగునా అన్నదాన శిబిరాలు..
అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులకు బల్కంపేటకు చెందిన కూతురు భూమయ్య, మల్లయ్య వంశవృక్షం నిర్వాహకులు కూతురు నర్సింహ ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి 11 గంటలకు వరకు ఇడ్లీలు, ఉప్మా పంపిణీ చేయగా, 12 గంటల నుంచి తిరిగి అన్నదానం చేశారు. దాదాపు 100కు పైగా అన్నదాన శిబిరాలు వెలిశాయి.
భక్తుల దర్శనం కోసం..
సాయంత్రం వేళల్లో దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉత్సవ మూర్తులను దర్శనానికి అందుబాటులో ఉంచాలన్న మంత్రి తలసాని ఆదేశాల మేరకు బాగా పొద్దుపోయే వరకు ఉత్సవ విగ్రహాలను వేదికపై ఉంచారు. ఇక అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకునేందుకు వచ్చే చివరి భక్తుడికి కూడా దర్శనమయ్యే వరకు ఆలయాన్ని తెరిచి ఉంచామని దేవాలయ ఈవో ఎస్.అన్నపూర్ణ తెలిపారు. సాయంత్రం 8 గంటల వరకు దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 10 లక్షలకు పైనే ఉంటుందని అంచనా.
ఇదిలా ఉంటే మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఫతేనగర్ వైపు ఉన్న వీవీఐపీ క్యూలైన్ సమీపంలో అక్కడి బిల్డింగ్‌లకు చెందిన విద్యుత్ తీగలు కారణంగా షార్ట్‌సర్క్యూట్ ఏర్పడింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలితోపాటు ఓ మహిళ(40) స్పృహ కోల్పోయారు. వృద్ధురాలిని తక్షణమే చికిత్స నిమిత్తం తరలించగా.. క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. కాగా, 40 ఏండ్ల మహిళకు అక్కడే ఉన్న పోలీసులు సీపీఆర్ ద్వారా చికిత్స అందించారు. అయితే అక్కడే ఉన్న దేవాలయ పాలక మండలి సభ్యురాలు దాసోజు పుష్పలత బాధితురాలికి వెంటనే నోటి ద్వారా శ్వాసను అందించే ప్రక్రియను చేపట్టడంతో ఆ మహిళ సాధారణ స్థితికి చేరింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.