ఎల్బీనగర్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చంపాపేట డివిజన్ కర్మన్ ఘాట్ లోని వెంకటేశ్వర హాస్పిటల్ పక్క వీధి నుంచి, వంగ శంకరమ్మ గార్డెన్ వరకు నిర్మించాల్సిన నాలా నిర్మాణ పనులు పద్మనగర్ కాలనీ వరకు పూర్తయ్యాయి. అక్కడి నుంచి పనులు నిలిచిపోయాయి. నాలా పనులు పూర్తి అయితే నీటి ముంపు నుండి గట్టెక్కుతారు. కానీ పనులు ఆగిపోవటం తో రాబోయే వర్షాకాలం కూడా ఇబ్బందులు తప్పేలా లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): మహానగరంలో అనేక ప్రాంతాలను వరద ముంపు నుంచి తప్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రారంభించిన నాలా అభివృద్ధి పనుల (ఎస్ఎన్డీపీ) పై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. గడిచిన 14 నెలలుగా పురోగతిలో ఉన్న ఎస్ఎన్డీపీ మొదటి దశ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యపు ధోరణిని అవలంబిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ పనుల్లో భాగంగా 40 ప్రాంతాల్లో 29 చోట్ల పనులను పూర్తి చేసి దాదాపు 175 కాలనీలకు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపింది.
43 కిలోమీటర్ల పనుల పూర్తితో దాదాపు 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. కానీ ప్రజాపాలన ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు 11 చోట్ల పురోగతి పనులను పూర్తి చేయలేక చేతులేత్తేసింది. ఫలితంగా నేటికీ ఎస్ఎన్డీపీ పనులు మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. చేసిన పనులకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించడం లేదని , పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేపడతామంటూ కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు చేతులెత్తేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం పనులను చకచకా పూర్తి చేసేందుకు అనుకూల సమయం…ఈ వేసవిలోగా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది.
తొలివిడతలో 58 చోట్ల..
2020 అక్టోబరు మాసంలో పెద్ద ఎత్తున వరదలు సంభవించిన తర్వాత వరద నీటికి శాశ్వత చర్యలు చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నగరాన్ని శాశ్వతంగా వరద ముంపు నుంచి తప్పించేందుకు ఎస్ఎన్డీపీ తొలి తొలి విడత పథకం ద్వారా రూ. 985.45కోట్లతో 58 చోట్ల నాలా అభివృద్ధి పనులకు చేపట్టింది. పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.531కోట్లతో 29 ప్రాంతాలలో వేలాది కాలనీల వరద ముంపు సమస్యకు పరిష్కారం చూపింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎన్డీపీ పనులను పట్టించుకోవడమే మానేసింది. క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతున్న పనులు సర్కారు అవలంబిస్తున్న తీవ్ర జాప్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
కాంట్రాక్టర్లకు చెల్లింపులను నిలిపివేశారు. చాలా చోట్ల గోడలు, స్లాబుల నిర్మాణ పనులు మరీ నెమ్మదిగా జరుగుతున్నాయి. ఫలితంగా రూ.394.65 కోట్లతో 11 చోట్ల జరుగుతున్న పనులపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా వచ్చే వర్షాకాలం నాటికల్లా ఈ పెండింగ్ పనులు పూర్తి కాకపోతే సరూర్‌నగర్, నాగోల్, సికింద్రాబాద్, ఎల్భీనగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట హయత్‌నగర్, వనస్థలిపురం, హబ్సిగూడ, ఉప్పల్ రామంతాపూర్‌తో పాటు శివారు ప్రాంతాలైన బడంగ్‌పేట, జల్పల్లి, పెద్ద అంబర్‌పేట, మీర్‌పేట ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాగా ఎస్ఎన్డీపీ రెండవ దశలో రూ.667.28కోట్లతో 40 చోట్ల పనులకు శ్రీకారం చుట్టగా.. పనులు అంగుళం కూడా ముందుకు సాగకపోవడం గమనార్హం.