సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రకటనల విభాగం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన చోట, కాంట్రాక్ట్ గడువు ముగిసినా తిష్టవేసిన కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తీరు బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. గడిచిన ఆరేండ్లుగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 15 మంది కాంట్రాక్ట్ గడువు గత నెల మార్చి 31తో ముగిసింది. వీరంతా ఆయా ప్రాంతాలకు పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు.
ఐతే వీరి కాంట్రాక్ట్ గడువు ముగిసి దాదాపు వారం రోజులు గడిచిన నేటికి యథేచ్ఛగా కొనసాగుతుండడం విశేషం. నిబంధనలను తుంగలో తొకి, కాంట్రాక్ట్ గడువు ముగిసినా తిష్టవేసిన కొందరు ఔట్ సోర్సింగ్ కొందరు ఉద్యోగులు అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు ఒకవైపు..మరోవైపు ‘జీతం వద్దు.. గీతమే ముద్దు’ అన్న రీతిలో కొనసాగుతున్న వీరి అక్రమాలకు దాదాపు 10 ఏండ్ల పాటు తిష్టవేసిన ఓ అధికారిణి వీరికి రక్షణ కవచంలా మారిందన్న చర్చ జరుగుతున్నది.
అన్నింటికంటే మించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అన్ని విభాగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సమూలా ప్రక్షాళన చేసి తిష్ట వేసిన వారికి ఇతర శాఖలకు బదిలీ చేశారు. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి వీరిని ఏ మాత్రం బదిలీ చేయకుండా కొనసాగిస్తున్న తీరు జీహెచ్ఎంసీ పనితీరుకు అద్దం పడుతుంది. అసలు వీరంతా ఏ ప్రాతిపదికన ఇంకా విధుల్లో కొనసాగుతున్నారో సమాధానం చెప్పే అధికారి కరువయ్యారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ విభాగంలో భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగితో పాటు ఇద్దరు అధికారులను కమిషనర్ సస్సెన్షన్ వేటు వేశారు. ఐనప్పటికీ ఏళ్ల తరబడి పాతుకుపోయిన అక్రమార్కులు ఈ విభాగాన్ని ఖాళీ చేసేందుకు వెనుకాడడం లేదంటే ఏ స్థాయిలో ముడుపులు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకేసారి అందరిని మార్చలేమని, పనులు సక్రమంగా జరగాలంటే పాత వాళ్లతోనే సాధ్యమనే రీతిలో ఉన్నతాధికారులు సైతం వంతపాడుతూ అవినీతి మరకలో కారణమవుతుండడం గమనార్హం.
మామూళ్ల పైనే ప్రధాన దృష్టి..
‘జీతం రాకపోయినా పర్వాలేదు.. సీటు మాత్రం వదలబోం’ అన్న చందంగా మారింది ప్రకటనల విభాగం ఉద్యోగుల వ్యవహారం. అధికారికంగా వచ్చే వేతనం కంటే, అక్రమ మార్గాల్లో వచ్చే మామూళ్ల పైనే వీరు ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నగరంలోని హోర్డింగ్‌లు, యూనిపోల్స్ నిర్వహణలో బడా ఏజెన్సీలు నిబంధనల ఉల్లంఘనలను చూసీచూడనట్లు వదిలేస్తూ, ప్రకటనల సంస్థల నుంచి భారీగా వెనకేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా వాణిజ్య సంస్థలు, చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే ప్రకటనల నుంచి భారీ ఎత్తున ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలెక్షన్లు చేస్తూ ఖజానాకు వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పర్మిషన్ల దగ్గర నుంచి పెనాల్టీల వరకు ప్రతి విషయంలోనూ పైచేయి సాధిస్తూ లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా వచ్చే అరకొర జీతం కంటే, క్షేత్రస్థాయిలో జరిగే సెటిల్ మెంట్ల ద్వారా వచ్చే ఆదాయమే వీరికి ప్రధాన వనరుగా మారడంతోనే గడువు ముగిసినా, సీటు వదలడానికి వీరు ససేమిరా అంటున్నట్లు ప్రచారం సాగుతున్నది. కమిషనర్ కర్ణన్, అదనపు కమిషనర్ ప్రియాంక ఆల జోక్యం చేసుకుని ఈ విభాగంలో తిష్ట వేసిన అనర్హులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.