పొంతన లేని ప్రకటనలు, వాస్తవానికి తావులేని హామీలు, ఆచరణకు కనిపించని ప్రతిపాదనలు మొత్తంగా మూసీ పునర్జీవంపై కాంగ్రెస్ సర్కార్ సరికొత్త నాటకాలతో కాలం గడుపుతున్నది. ఏడాదిన్నర కిందట మూసీ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేశామని మంత్రి మల్లు భట్టి చెబితే… అదే మాటను మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబుతోపాటు, ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహా రెడ్డి వరకు వారం రోజుల్లో డీపీఆర్‌ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించిన నేటికి 15 రోజులు గడిచిపోయింది. కానీ మూసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్ప.. ఎక్కడా కూడా ప్రాజెక్టు డిటైల్డ్ రిపోర్టు మాత్రం కనిపించడం లేదు. నేతలు, ఉన్నతాధికారుల మాటలతోనే కోటలు కడుతూ… జనాల కళ్లు గప్పుతున్నారు. పక్షం రోజులు గడిచినా.. పారదర్శకతకు పాతరేసి, మూసీ నది పునర్జీవం పేరుతో జీవనదిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.
– సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ)
55 కిలోమీటర్ల పొడవైన మూసీ పునర్జీవం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ గడప దాటి ముందుకు రాలేకపోతున్నది. అంచనాలకు దక్కకుండా ప్రాజెక్టు వ్యయాన్ని లక్షన్నర కోట్లకు పెంచిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు డీపీఆర్‌ను ఏడాదిన్నర కాలంగా చెక్కుతూనే ఉన్నారు. ప్రాజెక్టు ముసుగులో వేలాది మందిని నిరాశ్రయులను చేయడంతోపాటు, వేలాది ఎకరాలను కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీసిన కాంగ్రెస్ సర్కారు వాస్తవాలను దాచిపెడుతూనే ఉంది. మూసీ పునర్జీవంపై 2023లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మొదలు… 2026 బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ వేదిక చెప్పిన మాటల వరకు ఎక్కడా కూడా పొంతన లేని మాటలు, ఆచరణకు సాధ్యం కానీ ప్రతిపాదనలుగానే మూసీ ప్రాజెక్టును మార్చివేశారు.
హామీలు… అమలు కానీ వాస్తవాలు…
మార్చి 9న సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టుపై సమగ్రమైన వివరాలను ప్రదర్శిస్తామని తొలుత ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లు మూసీపై ఉన్న గందరగోళానికి తెరపడుతుందని, మార్చి 13న స్టార్ హోటల్ వేదికగా డీపీఆర్ బయటకు వస్తుందని అంతా ఆశించారు. తీరా గ్రాఫిక్ బొమ్మలతో కూడిన కార్పొరేట్ పీపీటీనీ ప్రదర్శించి జనాలకు స్పష్టత లేకుండానే నాలుక మడతపెట్టారు. అదేసమయంలోనే ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి వారంలోగా డీపీఆర్‌ను వెబ్సైట్లో ఉంచుతామని స్పష్టమైన ప్రకటనతో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ డిటైల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ కాపీలను మూసీ వెబ్సైట్లో పొందుపరిచిన యంత్రాంగం… మార్చి 18న మంత్రి శ్రీధర్ బాబు 6500-7000 కోట్ల తొలి దశ డీపీఆర్ పూర్తి చేశామని చేసిన ప్రకటనకు కూడా అమలు కానీ హామీగానే మార్చివేశారు.
డీపీఆర్‌పై దాగుడుమూతలు…
ఫిబ్రవరి నెలలోనే సిద్ధమైన తొలి దశ డీపీఆర్‌ను బహిర్గతం చేయకుండా కాంగ్రెస్ సర్కారు దాగుడు మూతలు అడుతోంది. ఈ ప్రాజెక్టు వివరాలతో లోపాభూయిష్టంగా మారిన భూసేకరణ, అంచనా వ్యయం, నిర్వాసితుల సంఖ్య వంటి అంశాలపై అధికారికంగా డీపీఆర్‌తో స్పష్టత వస్తుంది. ఇదే న్యాయపరమైన చిక్కులకు కారణం అవుతుందని భావించి ఎప్పుడో సిద్ధమైన డీపీఆర్‌ను ఇప్పటికీ బయటపెట్టడం లేదు. ప్రాజెక్టు వివరాలు బయటకు వస్తే నిర్వాసితులు, పర్యావరణ, సామాజిక కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున్న నిరసన, ఆందోళన వ్యక్తమవుతుందని తెలిసే డీపీఆర్ పేరిట అసెంబ్లీ వేదికగానే సర్కార్ మభ్యపెడుతున్నది చివరకు ప్రాజెక్టు అంచనా వ్యయంపై అధికారిక ప్రకటన చేయకుండా, తొలి దశ డీపీఆర్తోనూ గందరగోళాన్ని పెంచేలా వ్యవహరిస్తుందే తప్ప.. ప్రజాధనంతో చేపట్టే భారీ ప్రాజెక్టు విషయంలో ఎందుకు పారదర్శకత పాటించడం లేదని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
స్టేక్ హోల్డర్లతో చర్చల్లేవు
మూసీ పేరిట మూడు వేల ఎకరాల భూములను సేకరిస్తామని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న సర్కారు… ఇప్పటివరకు స్టేక్ హోల్డర్‌తోపాటు, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించలేదు. కానీ కార్పొరేట్ హోటల్ వేదికగా డీపీపీ ప్రజేంటేషన్ నిర్వహించి చేతులు దులుపుకొన్నది. మరీ ఇప్పటివరకు ఎందుకు డీపీఆర్‌ను పబ్లిక్ డొమైన్‌లోకి పెట్టలేదని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. భూ నిర్వాసితులను మభ్యపెట్టేలా వ్యవహారిస్తున్న సర్కారు ఎందుకు ప్రాజెక్టు వివరాలను దాచిపెడుతున్నదన్నారు.