టీజీఎస్పీడీసీఎల్లో విద్యుత్ సామగ్రి కొరత వెంటాడుతున్నది. స్టోర్స్‌లో మెటీరియల్ లేకపోవడంతో వినియోగదారులతో సహా కాంట్రాక్టర్లు, విద్యుత్ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా, ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అసలు సామగ్రి లేకపోతే ఇంటికి కానీ ఇతర ఏ నిర్మాణానికీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నది. దీనికి తోడు యూజీ కేబుల్ వ్యవస్థను అమలుపరచాలంటూ చెబుతున్న దక్షిణ డిస్కం అందుకు కావాల్సిన కేబుల్‌ను కూడా సరఫరా చేయలేకపోతున్నది. ఇదంతా ఒక ఎత్తయితే 2024 ఆగస్టులో కట్టిన మెటీరియల్ డీడీలకు ఇప్పటివరకు 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు అందించలేదంటూ.. ఇటీవల సీఎండీ జితేశ్ వీ పాటిల్ నిర్వహించిన సమావేశంలో కాంట్రాక్టర్లు చెప్పుకొన్నారు. కాగా, గతంలో స్టోర్స్‌లో సామగ్రి పుష్కలంగా ఉండేదని, రెండేండ్లుగా ఏబీ స్విచ్‌ల కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని వినియోగదారులు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు స్టోర్స్‌లో వచ్చిన మెటీరియల్ వచ్చినట్లే మాయమవుతున్నది. అధికారుల అండదండలతోనే ఇది జరుగుతున్నట్లు తెలిసింది. మెటీరియల్ రవాణా చేసే గూడ్స్ ఆటోడ్రైవర్ల ద్వారా ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు కొందరి దగ్గర రూ.5వేల నుంచి రూ.12వేల వరకు వసూలు చేసి..స్టోర్స్‌లో మెటీరియల్‌ను పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)
దక్షిణ డిస్కంలో స్టోర్స్‌లో డీటీఆర్‌ల కొరత ఏర్పడింది. ప్రత్యేకించి నగరశివారులోని ప్రాంతాల్లో డీటీఆర్లు కావాలంటే వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందులోనూ గతంలో కట్టిన వాటి గురించే డిస్కం అధికారులు తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారంటూ పలువురు వినియోగదారులు డిస్కం ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ల కొరతతో పాటు ఇటీవల వేసవికాలంలో డీటీఆర్లు విపరీతంగా కాలిపోతుండడంతో ఆ కొరత మరింత ఎక్కువైందని సిబ్బంది చెబుతున్నారు. ఇదిలాఉంటే డీటీఆర్‌ల కొనుగోలు విషయంలో అధికారులకు, కంపెనీలకు మధ్య సరైన ఒప్పందం కుదరడం లేదని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో అడపాదడపా కొన్నికొన్ని డీటీఆర్లు ఇండెంట్ పెట్టి తెప్పించుకుంటున్నారని, స్టోర్స్‌లోకి ఒకరోజు పది డీటీఆర్లు వస్తే వాటిని సీరియల్ ప్రకారం ఇవ్వకుండా స్థానిక ప్రజాప్రతినిధుల పైరవీలతో, కొందరు అంతర్గతంగా జరుపుకొన్న ఒప్పందాలతో కేటాయిస్తున్నారని కొందరు కాంట్రాక్టర్లు సీఎండీకి ఫిర్యాదు చేశారు. కొందరు అధికారులు తమకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలతో పాటు డీటీఆర్లు ఇప్పించి తమకు కావాల్సినది తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
స్టోర్స్‌లో డీటీఆర్లు వచ్చాయంటే వాటిని సరఫరా చేయడంలో ఆటోవాలాలే కీలకమని వినియోగదారులు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కొన్ని నెలల నుంచి తాము సీరియల్లో ఉన్నప్పటికీ ఆటోవాలాతో ఒప్పందం కుదుర్చుకున్నవారికే డీటీఆర్లు దక్కుతున్నాయని వారు పేర్కొన్నారు. దక్షిణ డిస్కంకు డీడీ చెల్లించి ఆ తర్వాత తమ నంబర్ వచ్చినప్పుడు వర్క్ ఆర్డర్ తీసుకొని మెటీరియల్ తీసకోవాలి. ఇందుకోసం ఏఈ, డీఈలతో పాటు లైన్మెన్ తదితర సిబ్బంది సర్టిఫై చేయాలి. అయితే తాము డీడీలు కట్టి నెలలు గడిచినా మెటీరియల్ రావడం లేదంటూ గత కొన్ని నెలలుగా కాంట్రాక్టర్లు, వినియోగదారులు చెబుతున్నారు. కానీ స్టోర్స్‌లో మాత్రం వచ్చిన మెటీరియల్ వచ్చినట్లే మాయం అవుతున్నది. ఈ వ్యవహారమంతా అధికారుల అండదండలతోనే జరుగుతున్నదని తెలిసింది. ప్రధానంగా మెటీరియల్ రవాణా చేసే గూడ్స్ ఆటోడ్రైవర్ల ద్వారా ఈ దందా జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు కొందరి దగ్గర రూ.5వేల నుంచి రూ.12వేల వరకు వసూలు చేసి డిస్కం స్టోర్స్ వద్ద అన్ని పనులు తామే చేసి స్టోర్స్‌లో మెటీరియల్‌ను పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఆరోపించారు. డీడీలు కట్టి నెలల తరబడి ఎదురుచూస్తున్నా తమకు డీటీఆర్లు అందడం లేదని, కేవలం ఆటోవాలాలు చెబితే ఒక్కొక్కరికీ ఐదు నుంచి పది వరకు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నారని, మొత్తం నాలుగు ఆటోల్లో ఈ దందా కొనసాగుతున్నట్లుగా డిస్కంలో చర్చ జరుగుతోంది.