సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ) : విద్యుత్ అంతరాయాలను తగ్గించడానికి, వినియోగదారులకు విద్యుత్ సరఫరాపై విశ్వాసం కల్పించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో సిబ్బంది మరమ్మతు పనులు చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ అన్నారు. సోమవారం బంజారాహిల్స్ డివిజన్లోని జూబ్లీహిల్స్ సెక్షన్ పరిధిలో ఉన్న 11కేవీ అయ్యన్న ఫీడర్పై జరుగుతున్న చెట్ల కొమ్మల నరికివేతను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది చెట్ల కొమ్మలను నరకడానికి ఉపయోగిస్తున్న బ్యాటరీతో నడిచే చెట్ట కొమ్మల కత్తిరింపు యంత్రాలు, మొబైల్ బకెట్ లాడర్లతో సహా అత్యాధునిక సాంకేతిక పరికరాల పనితీరును సీఎండీ పర్యవేక్షించారు.
సంప్రదాయ పద్ధతిలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే యంత్రాలు, కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాటరీ యంత్రాలకు మధ్య తేడాను, భద్రత, నిర్వహణ సౌలభ్యం, పనితీరు పోలికను సమీక్షించారు. బ్యాటరీతో నడిచే పరికరాల పట్ల సిబ్బంది సానుకూల స్పందన వ్యక్తం చేశారు. తక్కువ శబ్ధం, సులభమైన నిర్వహణ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పనితీరుతో ఈ యంత్రాలు ప్రయోజనకరంగా ఉన్నాయని వారు సీఎండీకి తెలిపారు. ఇదిలా ఉంటే చెట్ల కొమ్మలు నరికిన తర్వాత ఎదురవుతున్న పరిస్థితులపై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని ప్రదేశాల నుంచి నరికిన చెట్ల కొమ్మలను వెంటనే నిర్దేశిత డంప్ యార్డులకు తరలించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు.