ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్ విడుదల చేసిన నేపథ్యంలో ఓయూలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లా కళాశాల ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఓయూ వీసీ, ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు అడ్డుకోగా విద్యార్థులు ప్రతిఘటించారు.
ఇరుపక్షాల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని అంబపేట, నల్లకుంట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ తమ హక్కుల కోసం పోరాడే విద్యార్థులను అణగదొక్కేందుకు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నిర్బంధం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.