రాష్ట్రంలో దొంగలు పడ్డారని, పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి మండిపడ్డారు. బహదూర్‌గూడ గ్రామ పరిధిలో రైతులకు చెందిన సుమారు 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ ం దౌర్జన్యంగా గుజ్జుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బహదూర్‌గూడ వద్ద రైతులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్నున్న కార్తిక్‌రెడ్డి, రైతులను పోలీస్‌లు అరెస్టు చేసి నందిగామ ఠాణాకు తరలించారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, యువ నాయకుడు మురళీకృష్ణయాదవ్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆ ఠాణాకెళ్లి ధర్నాకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
నందిగామ, జూలై 18: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ గ్రామ పరిధిలో రైతులకు చెందిన సుమారు 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యంగా గుజ్జుకుంటున్నదని బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి మండిపడ్డారు. బహదూర్‌గూడ వద్ద రైతులు తలపెట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న కార్తిక్‌రెడ్డి, రైతులను శనివారం పోలీస్‌లు అరెస్టు చేసి షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ ఠాణాకు తరలించారు. కార్తిక్‌రెడ్డి అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, యువ నాయకుడు మురళీకృష్ణయాదవ్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆ ఠాణాకెళ్లి ధర్నాకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది.
ఈ సందర్భంగా కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాకు అమరరాజ్ కంపెనీని గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీసుకొస్తే మేమే తెచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. బహదూర్‌గూడ భూముల సమస్య ఇప్పటి నుంచి కాదని 60,70 ఏండ్లుగా ఉందని, ఇది ప్రభుత్వ భూమి అని మీరు ఎలా చెబుతారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.ని, ఎవరు మంచి చేస్తున్నారో.. ఎవరు చెడు చేస్తున్నారో తెలుసన్నారు.

రైతులు, ప్రజల పక్షాన బీఆర్ఎస్
రైతులు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రైతుల కష్టాలకు, ప్రజల ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కొత్తూరు మండలంలో సిద్దాపూర్ డంపింగ్‌యార్డు రాణించేది లేదు.. బహదూర్‌గూడ భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదన్నారు. రైతులు, ప్రజలు ఆందోళన చెందవద్దని మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీ ముందు ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు.
– మాజీ మంత్రి శ్రీనివాస్
రాష్ట్రంలో అరాచక పాలన
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రజలను నుంచి భూములు గుజ్జుకుంటున్నారు తప్ప చేసింది ఏమి లేదన్నారు. విద్యార్థులు, రైతులు, ప్రజలు మీ పాలనకు చరమగీత పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్ ప్రజలకు ఏమి చేస్తున్నారో చెప్పాలన్నారు. ఓ వైపు భూములు గుంజుకోవడం, మరోవైపు పచ్చని పంటపొలాల మధ్య డంపింగ్ యార్డు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ
ముందుంటుందన్నారు.
– ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి
భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
బీఆర్ఎస్ యువనాయకుడు అరెస్టు విషయాన్ని తెలుసుకున్న షాద్‌నగర్, శంషాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు భారీగా నందిగామ పోలీస్‌స్టేషన్ తరలివచ్చారు. ప్రజలను పట్టిపీడీస్తున్న ప్రభుత్వాన్ని నిలధీస్తే అరెస్టులా అని సీఎం డౌన్..డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాధాలు చేశారు.
బహదూర్‌గూడ రణరంగం

బహదూర్‌గూడ రణరంగంగా మారింది. బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం జరుగుతున్న భూ సేకరణ ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబర్ 62లో 500 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులోభాగంగా 15 రోజుల నుంచి అధికారులు మార్కింగ్ చేయడం ప్రారంభించారు. అయితే తమ భూములు ఇవ్వబోమంటూ.. శనివారం రైతులు శాంతియుతంగా చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతులను నెట్టివేస్తూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, కారం, కుర్చీలతో రైతులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
శంషాబాద్ రూరల్, జూలై 18: బహదూర్‌గూడ గ్రామ రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చేదిలేదని దీక్షకు దిగారు. రాత్రి,పగలు తేడా లేకుండా రైతులు దీక్ష కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా దీక్షకు ఎలాంటి అటంకం కలగించని పోలీసులు శనివారం తెల్లవారు జాము నుంచి బహదూర్‌గూడ గ్రామాన్ని నలుమాలలు చుట్టుముట్టారు. దీక్ష శిబిరాన్ని భగ్నం చేయడం వందలాది మంది పోలీసులు మోహరించారు. ఉదయం 7.30 గంటల సమయంలో హైడ్రా అధికారులు భూముల చుట్టు ఫెన్సింగ్ వేస్తుండడంతో దీక్ష శిబిరం నుంచి రైతులు ఒక్కసారిగా వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రైతులను అరెస్టు చేసి పోలీస్ వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తుండగా రైతులు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు.
గొడవ మరింత పెరుగుతుందని గమనించిన డీసీపీ యోగేష్‌గౌతమ్ అరెస్టు చేసిన వారిని వదిలివేయాలని ఆదేశించారు. అదే సమయంలో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కుమ్మరి నర్సింహ అనే రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయం నుంచి మిగిలిన రైతులు దీక్ష కొనసాగించారు. పోలీసులకు రైతులకు మధ్య జరిగిన తోపులాటలో కొంతమంది రైతులు కుర్చీలు విసరడంతో పాటు పోలీసుల కండ్లలో కారంచల్లారు. చేవెళ్ల డీసీపీ యోగేష్గౌతమ్తో పాటు శంషాబాద్ సీఐ నరేందర్‌రెడ్డి, పలువురు ఎస్సైలకు గాయాలయ్యాయి. బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబర్ 62లో 500 ఎకరాల భూమి మొత్తం 650 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవి ఆ భూములను ఎట్టి పరిస్థితిలో స్వాధీనం చేసుకుంటామని రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్ స్పష్టం చేశారు.