మొయినాబాద్, జూలై 08: దశాబ్దాలుగా భూమిని నమ్ముకుని.. సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులకు ప్రభుత్వం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రైతులకు బువ్వ పెట్టే భూమిని ప్రభుత్వం అప్పనంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ రైతులను నిర్వాసితులను చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కంటి తుడుపుగా పరిహారం చెల్లిస్తే తీసుకునేది లేదని.. భూములను వదలమని రైతులు మొండిగా వ్యవహరిస్తున్నారు. ఏ సమయంలో ప్రభుత్వం పోలీసులను పెట్టి స్వాధీనం చేసుకుంటుందోనని భయంతోనే రైతులు భూముల వద్ద రాత్రి, పగలు కాపలా ఉంటున్నారు. ఆకలికి ఓర్చుకుంటూ రాత్రి సమయంలో చలి మంటలు కాస్తూ భూమికి కాపాలుగా ఉంటున్నారు. ఈ దయనీయ స్థితి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి రైతులకు ఏర్పడింది.
కాంగ్రెస్ సర్కార్ ఎన్కేపల్లిలోని 180 సర్వే నంబర్లోని 99.14 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన 50 కుటుంబాలు గత ఏడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్నాయి. ఆ విలువైన భూములను ప్రభుత్వం గోశాలకు ఇవ్వాలని ప్రతిపాదించింది. రైతులకు ఇప్పటివరకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా భూముల్లోనికి వెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా ఆ భూములను తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పోలీసులను కాపలా పెట్టి ఆ భూముల్లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా భూభాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సోమవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా భూముల్లో పనులు ప్రారంభించడానికి భూమి పూజ సైతం చేశారు. అదేవిధంగా భూమికి కంచె వేయడానికి కడీలు, ఫెన్సింగ్ వైరు తీసుకురావడంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొన్నది.
ప్రభుత్వం పోలీసులను పెట్టి ఎలాగైనా భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నదని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం ఎమ్మెల్యే పూజ చేసి వెళ్లిన అనంతరం పోలీసులు, రైతుల మధ్య తోపులాటతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఎట్టి పరిస్థితుల్లో భూములను వదిలేది లేదని భూ బాధితులు సోమవారం రాత్రి భూముల వద్దనే కాపలా ఉన్నారు. ఒకవైపు భూ బాధితులు.. మరోవైపు పోలీసుల పహార ఉండటంతో అక్కడ వద్ద టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నది.