సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీకి సంబంధించి ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే ముందుగా స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆమోదం పొందాలి. ఆ తర్వాతనే ఆయా పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను ప్రారంభించాలి..కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ అధికారుల నిబంధనలను తుంగలో తొక్కి ‘స్మార్ట్’ పార్కింగ్ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియను చేపట్టారు. జపాన్ తరహాలో అధునాతన సాంకేతికతతో కూడిన పార్కింగ్ సదుపాయాల కల్పనకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) నోటిఫికేషన్ జారీ చేయగా.. నాలుగు ఏజెన్సీలు ముందుకొచ్చాయి.
జృతి సొల్యూషన్స్, జూకీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మానస కన్స్ట్రక్షన్స్ ప్రై.లి, జొనొఫై ప్రై.లి కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో రెండు ఏజెన్సీలు జృతి సొల్యూషన్స్, జూకీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు అర్హత సాధించినట్లు అధికారులు తేల్చారు. ఈ రెండు ఏజెన్సీలకు స్మార్ట్ పార్కింగ్ ప్రాజెక్టు పనుల అప్పగించే క్రమంలో భాగంగా ప్రకటనల విభాగం అధికారులు గత గురువారం (ఈ నెల 21వ తేదీ)న జరిగిన స్టాండింగ్ కమిటీ ముందుకు ఈ ప్రతిపాదన పెట్టారు.
ఈ ప్రాజెక్టు టెండర్‌కు ఎవరూ అనుమతి ఇచ్చారు? ఏ ఆదేశాల మేరకు టెండర్లు పిలిచారు? ఈ ప్రాజెక్టు లక్ష్యాలేంటీ? పనులు చేపట్టే ప్రాంతాలను ఎక్కడ గుర్తించారు? అన్న వివరాలేమి లేకుండా గుడ్డిగా ఒక కాగితంపై గుడ్డి దర్భార్‌లా ప్రతిపాదనలు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆమోదానికి పెట్టారు. దీనిపై స్టాండింగ్ కమిటీ సభ్యులు చర్చించగా..సంబంధిత ప్రకటనల విభాగం ఉన్నతాధికారి నుంచి సరైన సమాధానం రాలేదు..దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు..ఐతే ఈ నెల 28న జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు ఆరో అంశంగా ఈ ప్రతిపాదనను చేర్చి మళ్లీ ముందుకు తీసుకువస్తున్నారు.
ఐతే ఈ ప్రాజెక్టు మొత్తం వ్యవహారంలో అన్నీ తానై వ్యవహరించడమే కాకుండా తిరస్కరించిన ప్రతిపాదనను ఎలాగైనా ఆమోదించుకునేలా అధిక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ జోనల్ కమిషనర్ చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వంలోని ఓ పెద్ద కనుసైగల్లో సదరు జోనల్ కమిషనర్ వ్యవహరిస్తున్నారని, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో మడలెన్నో ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రేపటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు ఈ ప్రతిపాదనను ఆమోదిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.
పనులపై స్పష్టత కరువు..
గ్రేటర్లో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేలా, రోడ్లపై అక్రమ పార్కింగ్ నియంత్రణ లక్ష్యంగా ప్రతిపాదించిన స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కార్వాన్ సర్కిళ్ల పరిధిలో స్మార్ట్ పార్కింగ్ వసతి కల్పించేందుకుగానూ జపాన్ తరహాలో అధునాతన సాంకేతికతతో కూడిన పార్కింగ్ సదుపాయాల కల్పనకు జీహెచ్ఎంసీ ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) నోటిఫికేషన్ ప్రకటించారు. ఇందుకు నాలుగు సంస్థలు ముందుకు వచ్చాయి.
ఇందులో నిబంధనల ప్రకారం రెండు ఏజెన్సీలు జృతి సొల్యూషన్స్, జూకీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటుకు అర్హత ఉన్నట్లు తేల్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పార్కింగ్ అండ్ రిలేటెడ్ సర్వీస్, ప్రకటనలు, మేనేజ్మెంట్ ఆఫ్ వెండింగ్ మిషిన్, డ్రైవర్లకు రెస్ట్ రూంలు ఉంటాయి. పీపీపీ విధానంలో చేపట్టే ప్రాజెక్టుపై స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముందుగా చర్చించకుండానే పనులు అప్పగించే స్థితి వెళ్లడం వివాదానికి దారి తీసింది. ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడ చేపడుతారు? అన్న అంశాలపై స్పష్టత లేకపోవడం గమనార్హం.