అబిడ్స్,ఫిబ్రవరి 10 : గోషామహల్ జ్ఞాన్‌బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో పోలీసులు నిర్వహించిన తనీఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రెండు ద్విచక్రవాహనాలపై ముగ్గురు వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్ఐ, పోలీస్ సిబ్బందితో కలిసి అనుమానితులను అడ్డుకొని తనిఖీలు చేయగా మూడు సంచులను గుర్తించారు. నగదును తరలిస్తున్న జోటార్మ్,గణపతి రామ్,రాకేశ్ దేవాసిలుగా గుర్తించారు.
నగదును లెక్కించగా రూ.76 లక్షల 87 వేల 650లు ఉన్నట్లు తేలింది. నగదును పంచ్ ఛిట్లతో సీల్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్లో భధ్రంగా ఉంచారు. దర్యాప్తు చేయగా బేగంబజార్‌కు చెందిన సందీప్ కల్పేశ్, కుపారామ్, కార్తీక్‌ల సూచనల మేరకు లెక్కల్లో చూపని డబ్బును సేకరించి హైదరాబాద్‌లోని అఫ్టల్గంజ్కు చెందిన ఠాగరంకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. తదుపరి చర్యల కోసం ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.