Jalamandali | సిటీబ్యూరో: మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న అమృత్-2 పథకం పనులకు ప్రభుత్వం ఆదిలోనే అపసోపాలు పడుతున్నది. టెండర్ల ప్రక్రియను ముగించుకుని పనులు పట్టాలెక్కాల్సిన చోట ఏజెన్సీలు ఈ ప్రాజెక్టు పనులకు ముందుకు రావడం లేదు. ప్యాకేజీ-2లోని రూ. 1388.22 కోట్లతో 22 చోట్ల ఎస్టీపీ పనులతో పాటు 15 సంవత్సరాల నిర్వహణకు మొదటి విడత టెండర్‌కు ఏజెన్సీల నుంచి ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. టెండర్లో పేర్కొన్న రేట్లతో పనులు చేపట్టడం సాధ్యం కాదని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో పాటు హెచ్ఏఎం మోడ్‌లో ఈ పనులు ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టడం వీలు కాదని పేర్కొన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలోనే గత నెల మొదటి వారంలో మొదటి టెండర్ పిలవగా, ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో తిరిగి గత నెల 30న రెండో సారి టెండర్ పిలవగా, ఈ నెల 9వ తేదీ వరకు తుది గడువుతో మళ్లీ పిలిచారు. ఈ పనులకు ఏజెన్సీలు ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుతం మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది.
ప్యాకేజీ-2 పనులకు పత్రికల్లో టెండర్ నోటిఫికేషన్ ప్రకటించి ఆన్లైన్లో టెండర్ వివరాలను పొందుపరుస్తామని చెప్పారు. కానీ వారం దాటినా.. ఆన్‌లైన్‌లోకి టెండర్ డాక్యుమెంట్స్ రాలేదు. అమృత్ గైడ్‌లైన్స్, డాక్యుమెంట్స్ అప్‌లోడ్‌లో సమయం అంటూ.. చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 20 రోజుల సమయంలో పనులు చేపట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదని తాజాగా రెండోసారి టెండర్ ఆహ్వానించారు. అయితే మొదటిసారి పిలిచినప్పుడు టెండర్ (ప్రాజెక్టు) వాల్యూ రూ.1388. 22కోట్లు (ఎస్టీపీల నిర్మాణ వ్యయం రూ. 846.67, 15 సంవత్సరాల నిర్వహణకు రూ. 541.55 కోట్లు) ఉంటే రెండోసారి పిలిచిన టెండర్లో ప్రాజెక్టు వాల్యూ రూ. 1315.22 కోట్లుగా(నిర్మాణ వ్యయం రూ. 773.67 కోట్లు, నిర్వహణకు రూ. 541.55 కోట్లు) పేర్కొన్నారు. నిర్మాణ వ్యయంలో ఏకంగా రూ. 73 కోట్ల మేర తగ్గించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
మూసీ నది ప్రక్షాళనలో భాగంగానే రూ. 3784 కోట్ల అంచనా వ్యయంతో 965 ఎంఎల్డీల సామర్థ్యంతో కొత్తగా మరో 39 ఎస్టీపీల ప్రాజెక్టుకు జలమండలి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రెండు ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు. అమృత్ పథకం కింద కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 39 ఎస్టీపీల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ప్యాకేజీ-2లో భాగంగా 471.50 ఎంఎల్డీ సామర్థ్యంతో 22 ఎస్టీపీల పనులకు టెండర్లు పిలిచారు. ఎస్టీపీ నిర్మాణ పనుల్లో భాగంగా పీర్జాదిగూడ (61 ఎంఎల్డీ), కొర్రెముల 34.50, నాగారం లేక్ 47.50, చేర్యాల లేక్ 6.50, కుందన్‌పల్లి 9, యానంపేట 26, కుంట్లూరు 31.50, గౌరెల్లి 7, ఈదుల చెరువు 23.50, పల్లె చెరువు 13.50, ఉమ్దాసాగర్ 23.50, బండ్లగూడ 5.50, గుర్రంచెరువు 19.50, మీర్‌పేట తలాబ్ ఎస్టీపీ 18, సందన చెరువు 20, రావిర్యాల్ 12, బొంగుళూరు 5.50, మాసబ్ చెరువు 36.50, కోత్వాల్‌గూడ 1, లేక్ కాముని 2.50, హైదర్ష్కోట్ 36.50, సంగం బాపుఘాట్ 31 ఎంఎల్డీ సామర్థ్యంతో ఈ ఎస్టీపీ నిర్మాణం జరుగనున్నది.