హైదరాబాద్ : ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పలు ఆలయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం శివాజీ నగర్‌లోని పెరుమాళ్ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన వెయ్యి గజాల స్థలంలో కల్యాణ మండప నిర్మాణ పనులకు మంత్రి స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ..ఆధ్యాత్మిక చింతన ఉండే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని పలు ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రూ.1200 కోట్లతో యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రూ 3.5 కోట్ల వ్యయంతో ఆలయ చైర్మన్ నర్సారెడ్డి, ధర్మకర్తల సహకారంతో ఆలయ కల్యాణ మండప నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి కల్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ కొంతం దీపిక, ఆలయ చైర్మన్ నర్సారెడ్డి, జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఈఓ శ్రీనివాస శర్మ, ట్రస్టు బోర్డు సభ్యులు నరేందర్‌రెడ్డి. తేజ్‌పాల్, నరేష్, రాయి వెంకటేష్, శారద, గోవిందన్, నిత్యానంద్, మురళీ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, సురేష్ కుమార్, సాయి బాబ, సత్యనారాయణ, సబిత, రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్. శ్రీనివాస్, నాయకులు, పిట్ల నాగగేష్, జి. నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.