తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 2: తెలుగు భాషా అస్తిత్వానికి ప్రతీకగా నెలకొల్పబడిన తెలుగు విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో సేవలందిస్తున్న సృజనశీలురులకు పురస్కారాలు అందజేస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలుగజేయడం అభినందనీయని తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరిక్రిష్ణ అన్నారు. వివిధ రంగాలలో విశేషమైన సేవలు అందించిన 24మంది ప్రముఖులకు 2023 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాలను మంగళవారం నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా మామిడి హరిక్రిష్ణ మాట్లాడుతూ.. భాష, సాహితీ రంగాలకు తెలుగు విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని ప్రశంసించారు. తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య వీ నిత్యానందరావు పురస్కారగ్రహీతలను సభకు పరిచయం చేసి విశ్వవిద్యాలయం కృషిని సభికులకు వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, విస్తరణ సేవా విభాగం అసిస్టెంట్ డైరక్టర్ రింగురామ్మూర్తి పాల్గొన్నారు. కీర్తి పురస్కారాలను మునిమడుగుల రాజారావు (ఆధ్యాత్మికసాహిత్యం), డాక్టర్ వారణాసి వెంకటేశ్వర్లు (ప్రాచీన సాహిత్యం), కొరుప్రోలు హరనాథ్ (సృజనాత్మక సాహిత్యం), సీఎస్ రాంబాబు (కాల్పనిక సాహిత్యం), ప్రభాకర్ మందార (అనువాద సాహిత్యం), డాక్టర్ టీ లక్ష్మీనారాయణ (అనువాదం), డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ (బాల సాహిత్యం), సయ్యద్ హనీఫ్ (వచన కవిత), నందకిషోర్ (వచన కవిత యువకవి), డాక్టర్ ఇరువింటి వెంకటేశ్వరశర్మ (గజల్), డాక్టర్ రాయల హరిశ్చంద్ర (నాటకరంగంలో కృషి),
ముంజపల్లి వీరబ్రహ్మేంద్రాచారి (పద్యరచన), పిన్నంశెట్టి కిషన్ (కథ), ప్రభాకర్ జైని (నవల), మంగిపూడి రాధిక (హాస్యరచన), పగిడిపాల ఆంజనేయులు (జీవిత చరిత్ర), డాక్టర్ జ్యోతిరాణి (వివిధ ప్రక్రియలు), డాక్టర్ దేశిరాజు లక్ష్మీనర్సింహారావు (ఉత్తమ నాటక రచయిత), డాక్టర్ చిత్తర్వు మధు(జనరంజక విజ్ఞానం), డాక్టర్ వి.త్రివేణి (పరిశోధన), ఆచార్య డీ విజయలక్ష్మి (భాషా ఛందస్సు), ఆచార్య సీహెచ్ సుశీలమ్మ (సాహిత్య విమర్శ), విల్సన్రావు కొమ్మవరపు (వచన కవిత), బులుసు అపర్ణ (అవధానం) విభాగంలో పురస్కారాలు అందుకున్నారు. ఒక్కొక్కరికి రూ.5,116 నగదు, శాలువా, అభినంధన పత్రాన్ని అందజేసి సత్కరించారు.