హైదరాబాద్, జూలై 22, నమస్తే తెలంగాణ: జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని నివాస ప్రాం తాలు, ఆస్పత్రులు, చారిత్రక కట్టడాల వద్ద పావురాలకు ఆహారం వేయడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ముషీరాబాద్‌కు చెందిన డాక్టర్ రాధేశ్యామ్ టపాడియా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..పావురాలు పెద్ద సంఖ్యలో చారిత్రక కట్టడాలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో చేరకుండా నియంత్రించే మార్గదర్శకాలు రూపొందించాలని, వాటికి ఆహారం అందించేవారిపై జరిమానాలు విధించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే, పావురాల వల్ల ప్రజారోగ్యానికి కలిగే దుష్పరిణామాలపై అవగాహనకార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. వాదన లువిన్న ధర్మాసనం..ప్రభుత్వం,బల్దియా 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.