బేగంపేట్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ( Talasani Srinivas Yadav) అన్నారు. ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట్ డివిజన్లో బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఉచితంగా అందిస్తోందని పేర్కొన్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను కేటాయిస్తున్నామని వెల్లడించారు. దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకు దళిత బంధు ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) దని తెలిపారు.
పేదింటి ఆడబిడ్డల వివాహానికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా అండగా నిలుస్తున్నారని వివరించారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, డివిజన్ అధ్యక్షుడు సురేష్‌యాదవ్, నాయకులు శ్రీహరి, రవీందర్‌రెడ్డి, రాజయ్య, నరేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.