మేడ్చల్, ఫిబ్రవరి8 : అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లింగాపూర్ తండాలో కౌన్సిలర్ అభ్యర్థి ముడావత్ నవీన్ తరుపున ఆదివారం మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడంలేదని అన్నారు. అభివృద్ధి జరగాలన్నా, పథకాలు సక్రమంగా అమలు కావాలన్నా బీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజలపై దౌర్జన్యంతో గెలవాలకుంటున్న కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రేస్ నేతలు మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జ్ గజ్జెల నగేశ్, పార్లమెంట్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, మధుకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.