‘యూటర్న్ తీసుకోవడం ఎందుకు.. టైం వేస్ట్.. రాంగ్ రూట్లో పోదాం’ అని అనుకుంటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు. రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక్ పోలీసులు.. ఇక మీదట నిబంధనల విషయంలో కఠిన వైఖరి అవలంబించనున్నారు. ఇన్నాళ్లు నిబంధనలు బేఖాతరు చేసే వారిపై భారీ జరిమానాలు వేస్తున్నా.. వాహనదారుల్లో మార్పు రావడం లేదని భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఏకంగా రాంగ్ రూట్లో వెళ్లేవారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ వారు ప్రమాదానికి కారకులైతే.. జైలు శిక్ష కూడా పడుతుందట. ‘వాహనదారులూ బీ అలర్ట్.. నిబంధనలు పాటిస్తూ.. ప్రయాణం చేయండి.. సురక్షితంగా గమ్యస్థానం చేరండ’ంటూ.. సూచిస్తున్నారు.
Wrong Route Driving | సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తేతెలంగాణ) : అవతలి రోడ్డుకు వెళ్లాలంటే లేదా ఆ రహదారిలోని పక్క సందులోకి వెళ్లాంటే.. కనీసం 200 మీటర్ల దూరం వెళ్లి.. అక్కడ యూ టర్న్ తీసుకొని వెళ్లాలి. అంత దూరం వెళ్లడం అవసరమా.. ఎంచక్కా రాంగ్రూట్లో వెళ్తే క్షణాల్లో అనుకున్న చోటకు వెళ్లొచ్చని అనుకుంటున్నారా.. ఇక నుంచి అలా కుదరదు.. ఎందుకంటే..అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ తప్పదంటున్నారు పోలీసులు. ఇక నుంచి ఎవరైనా రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. చార్జిషీట్ దాఖలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఒకవేళ వారు ప్రమాదాలకు కారణమైతే..జైలు శిక్షకూడా పడుతుందంటున్నారు.
రోజూ సగటున 10 నుంచి 20 వరకు..
ప్రస్తుతం ట్రై కమిషనరేట్ల పరిధిలో ప్రతిరోజూ సగటున 10 నుంచి 20 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ కనీసం ఒకరిద్దరు మృత్యువాత పడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు.
రాంగ్‌రూట్ డ్రైవింగ్‌తో 8 మంది మృతి
రాంగ్‌రూట్ డ్రైవింగ్ వల్ల గతేడాది 8 మంది మృతి చెందగా 150 మంది గాయపడ్డారు. ఈ సంవత్సరం ఒకరు చనిపోగా, 128మంది గాయపడ్డారు. బుధవారం ఒక్కరోజు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రాంగ్రైట్ డ్రైవింగ్ చేస్తూ 688 మంది వాహనదారులు పట్టుబడగా అందులో 659 మంది ద్విచక్రవాహనదారులే ఉండటం గమనార్హం. మిగిలిన వారిలో 21 మంది త్రీవీలర్స్, 8 మంది ఫోర్ వీలర్స్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
సైబరాబాద్‌లో తొలిసారిగా..
రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇంతకుముందు లేదు. మొదటి సారిగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తొలిసారిగా ఈ సంవత్సరం మేలో ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ తెలిపారు. నెల రోజుల వ్యవధిలో కమిషనరేట్ వ్యాప్తంగా రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేసిన 250మందికి పైగా గుర్తించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేసే వాహనదారులను గుర్తించేందుకు కమిషనరేట్ పరిధిలోని 124 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏఎన్పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కెమెరాల ద్వారా రాంగ్‌రూట్ వెళ్లే వారిని గుర్తించి, వాహనదారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదాలకు కారణమైతే జైలు తప్పదు
ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా రాంగ్‌రూట్ డ్రైవింగ్ వల్లే ఉంటున్నాయి. రాంగ్‌రూట్ డ్రైవింగ్ వల్ల నియమాలు ఉల్లంఘించిన వారికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ప్రమాదం.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు వేసినా.. వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దీంతో కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
రాంగ్‌సైడ్ డ్రైవింగ్ అనేది మోటర్ వెహికిల్ యాక్ట్ 119/177, 184 సెక్షన్ల ప్రకారం నేరం. వారిపై భారతీయ న్యాయ సంహిత 125, 281 చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అలాగే వారు ప్రమాదాలకు కారణమైతే వారికి ఆరు నెలల నుంచి మూడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేసు తీవ్రత ఆధారంగా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడవచ్చు.
– విశ్వప్రసాద్, అదనపు పోలీస్ కమిషనర్(ట్రాఫిక్)