సీనియర్ జర్నలిస్టు అనిల్‌కుమార్ (55) హఠాన్మరణం చెందారు. కర్ణాటకలోని గోకర్ణ శ్రీ మురుదేశ్వర ఆలయంలో దర్శనం ముగించుకుని ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగొస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన భత్కల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అనిల్‌కుమార్ తుదిశ్వాస విడిచారు.
సీనియర్ జర్నలిస్టు అనిల్‌కుమార్ అనేక ప్రసిద్ధ దినపత్రికల్లో జర్నలిస్టుగా సుదీర్ఘంగా సేవలందిచారు. 1994లో ‘న్యూస్ టైమ్’ రిపోర్టర్‌గా కెరీర్ ఆరంభించిన ఆయన.. టీఎన్ఐ చెన్నై, ఏపీ టైమ్స్, డైలీ హిందీ మిలాప్ వంటి ప్రముఖ దినపత్రికల్లో పనిచేశారు. స్వతంత్ర వార్తలో బ్యూరో ఇన్చార్జిగా 12 ఏళ్లపాటు సేవలందించారు. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ఆరేళ్లు పనిచేశారు. అనంతరం 2022లో తెలంగాణ టుడే దినపత్రికలో చేరారు. హైదరాబాద్‌లోని సఫిల్‌గూడలో అనిల్‌కుమార్ నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య ఆషా, ఇద్దరు పిల్లలు రష్మి, రాహుల్ ఉన్నారు.
సీనియర్ జర్నలిస్టు అనిల్‌కుమార్ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిస్టుగా అనిల్ కుమార్ పత్రికారంగానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.
సీనియర్ జర్నలిస్టు అనిల్ కుమార్ ఆకస్మిక మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి ధైర్యం చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీనియర్ జర్నలిస్ట్ అనిల్ కుమార్ ఆకస్మిక మరణంపై మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జర్నలిజం రంగానికి అనిల్ కుమార్ అందించిన విశిష్టమైన సేవలను ప్రశంసించారు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు.