సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, గులాబీ శ్రేణులు విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు, నవంబరు 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటన అని కొనియాడారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఒక చరిత్ర అని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. మంగళవారం నిమ్స్ దవాఖానలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ 2001 సంవత్సరంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి సాగర హారం, సకల జనుల సమ్మె, వంటావార్పు వంటి కార్యక్రమాలతో సుదీర్ఘ కాలం పోరాటం చేసి ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు అన్ని వర్గాలను కేసీఆర్ ఐక్యం చేశారని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని వివరించారు. తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ 29 నవంబరు 2009న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ జాతిని మొత్తం ఏకం చేసిందన్నారు.
11 రోజుల కేసీఆర్ దీక్షకు నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9న ప్రకటన చేసిందన్నారు. చరిత్రలో నిలిచిపోయే రోజును విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నట్లు తలసాని చెప్పారు. పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నాయకులు మాగంటి సునీత, విప్లవ్‌కుమార్, మేడె రాజీవ్ సాగర్, మన్నె గోవర్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ పోరాట ఫలితమే రాష్ట్రం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ప్రత్యేక రాష్ట్రం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 11రోజుల దీక్ష ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ సర్కిల్ పరిధిలోని జిల్లెలగూడలో విజయ్ దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మీర్పేట్ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లెలగూడలో ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి చందన చెరువు కట్టవరకు పాదయాత్ర చేపట్టి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి క్షీరాభిషేకం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్రం సిద్ధించదని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. కూకట్పల్లి వై జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం కేపీహెచ్‌బీ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ సారథి కేసీఆర్ చేపట్టిన దీక్ష ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన కల నెరవేరిందని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మాగంటి సునీతా గోపీనాథ్ తెలిపారు. కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దేవీప్యరావుతో పాటు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. రాంనగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకర్ ముదిరాజ్,మన్నే దామోదర్ రెడ్డిల ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహలు హాజరై తెలంగాణ తల్లి, అంబేద్కర్, కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.
