Sports School | సిటీ బ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా క్రీడా యువజన సంక్షేమ అధికారి సుధాకర్‌రావుతో కలిసి ఆయన అడ్మిషన్లకు సంబంధించి వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశానికి సంబంధిత వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని.. దరఖాస్తు ప్రక్రియ జూన్ 7వ తేదీన ప్రారంభమైందని.. జూన్ 15న సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా తల్లిదండ్రులను విద్యాశాఖ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. హైదరాబాద్ జిల్లాలో మండల, జిల్లా స్థాయి ఎంపికకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని డీవైఎస్ఓ సుధాకర్‌రావు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.