Sanskrit | తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 12 : జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ సారస్వత పరిషత్తు ఇంటర్మీడియట్ విద్యా శాఖను డిమాండ్ చేసింది. ఈ నిర్ణయం మాతృభాషను పూర్తిగా అణిచివేసే చర్యగా అభివర్ణించింది. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా మార్కుల వేటలో విద్యార్థులకు సంస్కృతాన్ని అలవాటు చేసిన ప్రభుత్వ విధానం ఇప్పుడు మరింతగా తెలుగుకు అన్యాయం తలపెడుతున్నదని పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య అన్నారు.
కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా మాతృభాషలో విద్యాభ్యాసం తప్పనిసరిగా జరగాలని విద్యావేత్తలు, విద్యా కమిషన్లు ఎంతగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇప్పటికే అన్ని దశల్లోనూ ఆంగ్ల భాషకు ప్రాధాన్యం కట్టబెట్టారని విచారం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాయి వరకు ఎక్కడా బోధించని, జీవితంలో ఎక్కడా ఉపయోగపడని సంస్కృతాన్ని ప్రవేశపెట్టి తీరని అన్యాయం చేస్తే తెలుగు రాష్ట్రమైన తెలంగాణ సాంస్కృతికంగా తన తరతరాల అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాం పరిపాలనా కాలంలో కొడిగట్టుకుపోతున్న దశలో సారస్వత పరిషత్తు తెలుగు దీపాన్ని ఆరిపోకుండా ఉద్యమ ప్రాయంగా కృషిచేసిన చరిత్రను మరవకూడదని సూచించింది. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక విధానాలను చూసైనా విద్యా వ్యవస్థలో తెలుగుకు సముచిత స్థానం కల్పించాలని వారు కోరారు.