దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్‌వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ రన్ జోరుగా.. హుషారుగా సాగింది. సినీ తారలు మరింత జోష్ నింపారు. వివిధ చోట్ల నిర్వహించిన ఈ రన్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనగా, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఔత్సాహికులు భాగస్వాములయ్యారు. నెక్లెస్‌రోడ్‌లో జరిగిన 2కే, 5కే రన్‌ను మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్ గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నటి శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పీర్జాదిగూడలో జరిగిన పరుగులో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో జరిగిన రన్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ రన్ ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలు చోట్ల డీజే పాటలు, స్టెప్పులతో యువకుల్లో జోష్ నింపారు. ర్యాలీలో సినీ తారలు, గాయకులు పాల్గొని ఆట పాటలతో హుషారెత్తించారు. అనంతరం 2కే, 5కే రన్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.