మాదాపూర్, అక్టోబర్ 10: మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో వెలవెలబోయింది. నారెడ్కో తెలంగాణ ఎక్స్పో లోకు ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధితో పాటు భవిష్యత్ ప్రణాళికలపై జనాలను మెప్పించాలని చేసిన ప్రయత్నం బిల్డర్లకు జోష్‌ను అందించలేకపోయింది. నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడే మొదటగా ప్రభుత్వం 10 శాతం మార్టిగేజ్‌ను ఎత్తివేయాలని, లేదంటే కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిర్మాణ సమయంలో 13 శాతం విద్యుత్ చార్జీలు విధించడంతో కన్స్ట్రక్షన్ సమయంలో ఇబ్బందులు పడాల్సివస్తుందని చెప్పకనే చెప్పారు. మొదటిరోజే ఎక్స్ పోలో జనాల నుంచి ఆదరణ కరువవడంతో నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టాల్స్‌లో జనాలు వెలవెలబోవడంతో నిర్వాహకులు అయోమయంగా మారింది. ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ రాష్ట్రంలో పడిపోయినప్పటికి ధరలు స్టాల్స్ నిర్వాహకులు మాత్రం ఎంతో డిమాండ్ ఉందని, చాలా వరకు అమ్ముడుపోయాయని, ఆలస్యంతో బాధపడాల్సి వస్తుందని చెప్పడంతో కొనుగోలుదారులు మాత్రం మార్కెట్ పూర్తిగా పడిపోతున్నప్పటికి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయని అంటున్నారు. దీనికి తోడు హైడ్రా నిర్వాకంతో జనాలకు ఎక్కడ ప్రాపర్టీని కొనుగోలు చేస్తే ఎటువంటి ముప్పు వాటిల్లుతుందోనని ఆందోళన కూడా వెంటాడుతుంది.
కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విచ్చేసి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, పర్యాటక రంగ అభివృద్ధిలో బిల్డర్లు, రియల్టర్లు భాగస్వామ్యం కావాలన్నారు. దట్టమైన అడవులు, వాటి లోపల ఉన్న జలపాతాలు, టైగర్ ఫారెస్ట్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, రియల్టర్లు పలు ప్రాంత ప్రజలకు చేరువ చేయాలన్నారు.