సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): టీవీ, కేబుల్, వర్క్.. ఇలా ఏ వ్యవస్థ నడవాలన్నా.. ఏ పనులు జరగాలన్నా.. సమాజంలో ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవసరంలా మారిన నెట్ గొంతును కరెంటోళ్లు పిసికేస్తున్నారు. నెట్ ఉంటే ఏంటి లేకుంటే ఏంటంటూ నగరంలో ఇంటర్నెట్ పనిచేయడానికి అవసరమైన కేబుళ్లను కత్తిరిస్తున్నారు. రెండురోజులుగా హైదరాబాద్ నగరంలో విద్యుత్ సిబ్బంది కేబుల్ వైర్లను తొలగించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
రోజువారీ పనుల్లో కీలకంగా మారిన నెట్ సేవలు ఆగిపోవడంతో నగరవాసి ఇబ్బందులపాలయ్యాడు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాల మేరకు మంగళవారం మొదలుపెట్టిన ఈ కేబుల్ కటింగ్ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగింది. సహజంగా ఎక్కడైనా విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడితే గంటలైనా కదలిరాని సిబ్బంది ఈ కేబుల్ కటింగ్ కోసం వాడవాడలా తమ బలాన్ని ప్రదర్శించారు.
ఎస్పీడీసీఎల్ అధికారులంతా అత్యుత్సాహాన్ని కనబరుస్తూ సిబ్బందిని పురమాయిస్తూ స్తంభాలకు ఉన్న ఇంటర్నెట్, డిష్ కేబుల్స్ కట్ చేయడంతో నగరంలో ఎక్కడ చూసినా కుప్పకుప్పలుగా తెగిపడిన వైర్లు కనిపించాయి. మల్లుభట్టి విక్రమార్క ఆదేశించడంతోనే యుద్ధప్రాతిపదికన వీధుల్లోకి వెళ్లిన విద్యుత్ సిబ్బంది అప్పటి నుంచి నిర్విరామంగా ఇంటర్నెట్, డిష్ కేబుల్స్ కట్ చేస్తూ వచ్చారు. దీంతో చాలా చోట్ల నెట్ సేవలు హఠాత్తుగా ఆగిపోయి, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ప్రజాసేవలకు అంతరాయం ఏర్పడింది. రిజిస్ట్రేషన్లు, ఆర్టీఏ, మీసేవా కేంద్రాలు పనిచేయలేదు.
ఇళ్లల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు తమ మొబైల్ నెట్వర్క్ వాడే ప్రయత్నం చేసినప్పటికీ సరిపోక చాలా ఇబ్బందులు పడ్డారు. కేవలం 24 గంటల్లో నగరాన్ని అతలాకుతలం చేసిన కేబుల్ కటింగ్ వ్యవహారంపై ఇంటర్నెట్ ప్రొవైడర్లు సీఎండీ ముషారఫ్ ఫరూఖీని కలిశారు. తమ సమస్యలు చెప్పుకొని గడువు కోరినట్లు తెలిసింది.
కేబుల్ పునరుద్ధరణ పనులు చేపట్టినా ఒకట్రెండు రోజుల్లో మళ్లీ అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పినా లక్షలాది మంది వినియోగదారులు తమ ఆగ్రహాన్ని అటు ఇంటర్నెట్ ప్రొవైడర్లు, ఇటు ప్రభుత్వం, మరోవైపు కరెంట్ సిబ్బందిపై సోషల్‌మీడియా వేదికగా వెళ్లగక్కారు. ముందస్తు నోటీసులే లేకుండా ఎలా కట్ చేస్తారంటూ ప్రశ్నించారు.
అసలు సమస్య పక్కదారి పట్టిందా..
నగరంలో రెండురోజుల కిందట జరిగిన ఎనిమిది మంది మరణాలకు విద్యుత్ షాక్ కారణమైనప్పటికీ వాటి వెనక అసలు ఏం జరిగింది.. షాక్ ఎలా వచ్చింది. ఎవరిది బాధ్యత అనే దిశగా సమీక్షలు జరగలేదు. తప్పెవరిది అనే కోణంలో ఎవరికి వారు చేతులు దులిపేసుకున్నారు. అయితే ప్రజాగ్రహం పెల్లుబికడంతో ఒక్కసారిగా ఈ ప్రభావాన్ని పక్కదారి పట్టించాలంటే ఏదో ఒకటి చేయాలన్న కాంగ్రెస్ ప్రాథమిక సూత్రాన్ని ఇక్కడ కూడా ఐప్లె చేస్తూనే నగరంలో విద్యుత్‌షాక్ మృతులు, ఘటనను మరిచిపోయేలా కేబుల్ కటింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ప్రజల్లో చర్చ జరుగుతోంది.
తమ ఇంట్లో ఇంటర్నెట్ పోవడంతో ఎవరికి వారు తమ గురించి ఆలోచించుకునే పరిస్థితిలో ఉంటారని, వారి ఆగ్రహమంతా సర్వీస్ ప్రొవైడర్ల వైపు మళ్లడానికే ప్రభుత్వం ప్రత్యేకించి విద్యుత్‌శాఖ మంత్రి, అధికారులు కలిసి చేసిన డైవర్షన్ ప్లాన్‌గా అటు ఎంప్లాయీస్, ఇటు ప్రొవైడర్స్ సర్కిళ్లలో చర్చిస్తున్నారు.
మరోవైపు కేబుల్ కటింగ్‌ను ఆపేది లేదంటూ విద్యుత్ అధికారులు చెప్పడం వెనక పెద్దమనిషి పరంగా ఇంకేదైనా వ్యక్తిగత అంశాలు ముడిపడి ఉన్నాయా అనే దిశగా కూడా డిస్కంలో గుసగుసలాడుకుంటున్నారు. అసలు సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి సీఎండీని పంపి ఆయనతో ఒక ప్రకటన ఇప్పించి ఆ తర్వాత దానిపై వెంటవెంటనే కేబుల్ కటింగ్‌కు ఆదేశాలు జారీ చేశారంటే ఏం జరిగి ఉంటుందన్న లైన్లో పలు వర్గాలు మాట్లాడుకున్నాయి.
సిటీలో ఇంటర్నెట్ కట్
హైదరాబాద్‌లో కేబుల్ వైర్లు తొలిగించిన ప్రభావం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని రిజిస్ట్రేషన్, ఆర్టీఏ కార్యాలయాల్లో ఇంటర్నేట్ సేవలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఉన్న మీసేవా కేంద్రాల్లో ప్రజాసేవలకు అంతరాయం ఏర్పడింది. ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ఉదయం నుంచే ఇంటర్నెట్ బంద్ అవడంతో లెర్నింగ్ లైసెన్స్, ఆర్సీ, ఫిట్నెస్, పొల్యూషన్ తదితర అన్ని సేవలు నిలిచిపోయాయి.
తమ స్లాట్ ఉందని సంబంధిత కార్యాలయాలకు ఉదయమే చేరుకున్నప్పటికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు.అధికారులు సెంట్రల్ ఆఫీస్ ఐటీ విభాగానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. బుధవారం నాటి స్లాట్ గురు, శుక్ర వారాలకైనా అలర్ట్ చేయండని కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉదయం కొన్ని రిజిస్ట్రేషన్లు అయినా 12 తర్వాత మొత్తం నిలిచిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్న వారు మళ్లీ తమకు స్లాట్ ఎలా ఇస్తారంటూ అధికారులను అడిగారు.
ప్రైవేటు సెక్టార్లో మరింత గందరగోళంగా మారింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర చోట్ల ప్రైవేటు కంపెనీలు తమ పనులకు అంతరాయం ఏర్పడుతున్నదంటూ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. మంగళవారం ఈ సేవలకు సంబంధించి ఎయిర్టెల్, జియో తదితర సంస్థలకు లక్షకు పైగా ఫిర్యాదులు వస్తే బుధవారం కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయని సంస్థలు ప్రకటించాయి. తెంచిపడేసిన కేబుళ్లను సరిదిద్ది సేవలను పునరుద్ధరించే పనిలో ఉన్నామని వారు తెలిపారు.
కేబుళ్లు కోసి..కుప్పలుగా..
కేబుల్ కటింగ్‌లో భాగంగా బుధవారం కూడా విద్యుత్ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో కేబుల్స్ కట్ చేసి రోడ్లపై కుప్పలుకుప్పలుగా పడేశారు. మంగళవారం ఉదయం నుంచి సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో కేబుల్ కత్తిరింపులకు దిగినా.. ఆ రోజు మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు వారిని మరింత రెచ్చగొట్టాయి. ఇంటర్నెట్, డిష్, టెలిఫోన్ .. ఇలా ఎక్కడికక్కడ కేబుల్స్ కట్ చేస్తూ రోడ్లపై పారేసి పోవడంతో అటు ఇంటర్నెట్ ప్రొవైడర్లు, ఇటు కేబుల్ ఆపరేటర్లు తలలుపట్టుకున్నారు.
చాలా చోట్ల ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను కూడా ఒకేసారి కత్తిరించడంతో వందల సంఖ్యలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ స్పెషల్ డ్రైవ్‌ను పదిరోజులు కొనసాగిస్తామని విద్యుత్ సిబ్బంది చెప్పారు. కరెంట్ స్తంభాలపై అడ్డగోలుగా ఉన్న టీవీ కేబుల్ వైర్లు, ఫైబర్ నెట్వర్క్ ైవ్లె అడ్డగోలుగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని గణేశ్ నిమజ్జనం నాటికి మొత్తం తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి సిబ్బందికి ఆదేశాలు రావడంతో నానక్‌రాంగూడ నుంచి నిజాంపేట వరకు, నేరేడ్మెట్ నుంచి నల్లగండ్ల వరకు, అన్నోజిగూడ నుంచి బీరంగూడ వరకు వేలాడుతున్న కేబుళ్లు తొలగించడం మొదలుపెట్టారు.
దీంతో చాలా ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్, కేబుల్ టీవీ సేవలు నిలిచిపోయాయి. కేబుళ్ల తొలగింపు జరుగుతుండగానే వాటిని పునరుద్ధరించడానికి ఇంటర్నెట్ ప్రొవైడర్ల సిబ్బంది నానా కష్టాలు పడుతున్నారు. ఏవైర్ ఎలా కట్ చేశారో, ఆప్టికల్ ఫైబర్ కట్ చేసి తమకు చాలా నష్టం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర వైర్లు తొలగించకుండా నిత్యావసర వైర్లు తొలగించడం ఏంటంటూ వినియోగదారులు ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎంతో చర్చల తర్వాతే..!
నగరంలో ఎస్పీడీసీఎల్ సిబ్బంది ఇంటర్నెట్, డిష్ కేబుళ్లు కట్ చేస్తూ నగరమంతా అల్లకల్లోలం చేయడంపై ఇంటర్నెట్ ప్రొవైడర్ అసోసియేషన్ బుధవారం మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ డిస్కం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బలాలాతో కలిసి సీఎండీ ముషారఫ్ఫరూఖీని కలిశారు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు, కేబుల్ ఆపరేటర్లు, బలాలాతో డిస్కం అధికారులు చర్చలు జరిపారు. పదిహేను ఫీట్లపైన ఉన్న కేబుళ్లు తొలగించబోమని, అంతకంటే కింద ఉంటే మాత్రం తొలగిస్తామని సీఎండీ చెప్పినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు మాత్రం ఈ చర్చలు సఫలమయ్యాయని, తాత్కాలికంగా కేబుల్ కటింగ్ ఉండదని సీఎండీ చెప్పినట్లు తెలిపారు.
డిప్యూటీ సీఎం ప్రస్తుతం లేరని, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి చెబుతామని ముషారఫ్ అన్నారు. నగరంలో ఇంటర్నెట్, కేబుల్ వైర్లకు సంబంధించి తొలగింపు ప్రక్రియపై నిర్ణయం కూడా భట్టినే తీసుకోవాలని, ఆయన వచ్చిన తర్వాత మరోసారి చర్చలు జరుపుదామని సీఎండీ చెప్పినట్లు సమాచారం. మరోవైపు తమకు టైమ్ ఇస్తే ఇంటర్నెట్, కేబుల్ సంస్థలు కూర్చుని మాట్లాడుకుని తీగల క్రమబద్ధీకరణపై ఒక నిర్ణయం చెప్పే అవకాశముంటుందని సీఎండీ ముషారఫ్‌కు ఆపరేటర్లు చెప్పారని తెలిసింది.