పహాడీషరీఫ్, జూన్ 12 : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు భేష్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు పహాడీషరీఫ్, బాలాపూర్ పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ కమాన్ నుంచి షాహీన్‌నగర్ చౌరస్తా వరకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ హాజరై రన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పోలీస్‌శాఖలో సంస్కరణలు చేపట్టి ప్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. అత్యాధునిక నూతన వాహనాలను సమకూర్చారని అన్నారు. షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల భద్రతకు భరోసా కల్పించారని తెలిపారు. జల్పల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, తుక్కుగూడ ప్రాంతానికి పలు కంపెనీలు రానున్నాయని, త్వరలోనే మరో హైటెక్ సిటీగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం జోన్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ అంజయ్య, సీఐలు కాశీవిశ్వనాథ్, భాస్కర్, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, బడంగ్‌పేట డిఫ్యూటీ మేయర్ ఇబ్రాంశేఖర్, కో – ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, షేక్ అప్జల్, బర్కత్ అలీ, రాజు ముదిరాజ్, హుస్సేన్, ఇద్రీశ్, తదితరులు పాల్గొన్నారు.