సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని లక్ష మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేస్తూ, కేవలం ఒకరిద్దరు బడా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్(టోమో) మండిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా త్వరలో లక్ష మందితో అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. గ్రేటర్ వ్యాప్తంగా మెట్రో పిల్లర్లు, బస్ షెల్టర్ల వేదికగా టోమో నిరసన ఫ్లెక్సీల ప్రదర్శనలతో ప్రభుత్వ మొండివైఖరిని వినూత్న రీతిలో ఎండగట్టింది.
200 బస్ షెల్టర్లు, వందకు పైగా మెట్రో ఫిల్లర్ల మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రోజంతా చర్చ జరిగింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2-3 పెద్ద సంస్థలకు జీవో నం 68 నుంచి సడలింపులు ఇచ్చి, చిన్న ఏజెన్సీలను దెబ్బతీశారని, ఇటీవల జారీ చేసిన జీవో నంబరు 84 నూతన ప్రకటన పాలసీ రూపకల్పనలోను అన్యాయం చేశారని టోమో ప్రతినిధులు తెలిపారు. టోమో జేఏసీ సభ్యులు దశాబ్దాలుగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి పన్నులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఆదాయం సమకూర్చుతున్నామని వివరించారు.
హైదరాబాద్‌లో 1927 నుంచే అవుట్ డోర్ హోర్డింగ్‌లు ఉండేవని, దేశ వ్యాప్తంగా ప్రైవేట్ ప్రాపర్టీల హోర్డింగ్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వకపోవడం సరైన విధానం కాదన్నారు. ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను పూర్తి విస్మరించి మా జీవితాలను రోడ్డున పడేసిందన్నారు. రూప్‌టాప్ హోర్డింగ్‌లను అనుమతి ఇవ్వాలని, వెంటనే జీవో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.