Mediation Centre | మైలార్దేవ్పల్లి, ఫిబ్రవరి 21 : కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల ద్వారా డబ్బులు, సమయం వృధా చేసుకోకుండా కేసులను పరిష్కరించుకోవచ్చని రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరి తెలిపారు. అత్తాపూర్ వాసుదేవారెడ్డినగర్ కాలనలో శుక్రవారం నూతనంగా నాంపల్లి శ్రీకాంత్, శంకర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీహెచ్ పంచాక్షరి మాట్లాడుతూ.. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మీడియేషన్ సెంటర్ అత్తాపూర్లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు వివిధ సమస్యలపై ఇక్కడ పరిష్కరించుకోవటానికి అనుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లో అనుసరించాల్సిన విధివిధానాలపై మూడు రోజుల పాటు శిక్షణ పొందిన 15 మందికి సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏవో సీనియర్ జడ్జి కళార్చన, రంగారెడ్డి జిల్లా డిఎల్ఎస్ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై, శిక్షణ పొందిన మీడియేషన్ సెంటర్ సభ్యులు రామారావు, సురేష్తో పాటు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.