మేడ్చల్, జూన్ 5 : వ్యవసాయం , పారిశ్రామిక రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చి, రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో సీఎం కేసీఆర్ నిలిపారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని శ్రీగార్డెన్స్లో సోమవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే 24 గంటల కరెంట్ సాకారమైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు విడతల వారీగా వచ్చే లోఓల్టేజీ కరెంట్‌తో పంటలు పండక నష్టపోయారన్నారు. పారిశ్రామికవేత్తలు పవర్ హాలీడేలతో తీవ్రంగా నష్టాలు పాలయ్యారని తెలిపారు. స్వరాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను సమూలంగా మార్చారన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేశారని తెలిపారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగలా మార్చిందని అదనపు కలెక్టర్ ఎనుగు నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశం, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, దీపికానర్సింహా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, విద్యుత్ ఎస్ఈ శ్రీరామ్మోహన్, డీఈఈ శ్రీనాథ్ రెడ్డి, ఏడీఈలు సత్యనారాయణ రాజు, రమణారెడ్డి, ఏఈలు పవన్‌చందు, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్, సురేందేర్, ఎంపీడీవోలు, తాసీల్లార్లు పాల్గొన్నారు.