HYDRAA | సిటీబ్యూరో, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరులో పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా యలహంకలోని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సెంటర్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్, బృందం సభ్యులు అక్కడి అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. మానిటరింగ్ సెంటర్లో ఉన్న సీనియర్ శాస్త్రవేత్తలతో సమావేశమై బెంగళూరులో డిజాస్టర్ మేనేజ్మెంట్పై చర్చించారు. ఆ తర్వాత సెన్సార్ సాయంతో ముందస్తుగా వర్ష సమాచారం ప్రజలకు చేర్చడం, ఎంత మొత్తం వర్షం పడబోతోంది? వరద ముంచెత్తే ప్రాంతాల వారిని అలర్ట్ చేయడం, ట్రాఫిక్ జామ్ అలర్ట్, ప్రత్యామ్నాయ రహదారులను సూచించే విధానాలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు మేఘ సందేశం యాప్ పనిచేసే విధానం, ఈ యాప్ ద్వారా ఏయే ప్రాంతాల్లో ఎంత మోస్తరు వర్షం కురుస్తుంది? ట్రాఫిక్ జామ్, వడగండ్ల వానతో పాటు ఇతర వాతావరణ అంశాలతో అలర్ట్ చేసే ప్రక్రియను పరిశీలించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను అప్రమత్తం చేయడం, వరద కాలువలు ఎంత మొత్తంలో నిండాయి? ఈ నీరు ఎలా వెళ్తుంది? ఎక్కడ చెత్త పేరుకుపోయింది? ఇలాంటి అంశాలపై అలర్ట్ చేసే ప్రధానమైన సెన్సర్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
20 ఏండ్ల డేటాతో ఎన్ని సెంటిమీటర్ల వర్షం పడితే.. ఎక్కడ వరద వస్తుందో? అంచనా వేయడం, కేఎస్ఎన్డీఎంసీ కేంద్రంలో వర్షపాతం నమోదు, గాలి వేగం, ఉష్ణోగ్రతల వివరాలు చెప్పే కేంద్ర పనితీరును కమిషనర్ రంగనాథ్ బృందం చూశారు. ఆ తర్వాత యలహంక, జక్కూర్ చెరువులను పునరుద్ధరించిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి గతంలో ఎలా ఎండేది? ఇప్పుడెలా డెవలప్ చేశారు? అన్న అంశాలపై అధికారులతో మాట్లాడారు. చెరువుల్లోకి వస్తున్న మురుగును తొలగించి ఎస్టీపీల ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి చెరువులను నింపుతున్న విధానాన్ని, చెరువుల పునరుద్ధరణకు అనుసరిస్తున్న విధానాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణతో పాటు చెరువులోకి మురుగు చేరకుండా పైభాగంలో కుంటలు ఏర్పాటు చేసి సిల్ట్ నుంచి నీటిని వేరుచేసే విధానంపై బెంగళూరు అధికారులు హైడ్రా బృందానికి వివరించారు. చెరువుల పునరుద్ధరణకు ఏమోస్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు.
రెండోరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం హైడ్రా బృందం బెంగళూరులో లేక్ మ్యాన్ ఆనంద్ మల్లిగవాడ్తో సమావేశమవుతారు. కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014పై చర్చించనున్నారు. బెంగళూరు కోర్ సిటీలో ఉన్న చెరువులను పరిశీలిస్తారు. అనంతరం, ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గందోనహల్లిచెరువు, ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శిస్తారు. హైదరాబాద్లోని అప్ప చెరువు, సున్నం చెరువు, నల్ల చెరువు, ఎర్రగుంట చెరువులను పునరుద్ధరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తమ బృందంతో రెండు రోజుల పర్యటనకు బెంగళూరు వచ్చామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పా రు. బెంగళూరులో క్షేత్రస్థాయి పర్యటన తర్వాత హైదరాబాద్లో చెరువులను పునరుద్ధరిస్తామని, చెరువులను సుందరీకరించేందుకు బెంగళూరులో చేపట్టిన విధానాలపై ప్రభుత్వానికి తెలియజేస్తామని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లో ఉన్న ఈ పర్యటనలో కమిషనర్ రంగనాథ్ వెంట హైడ్రా బృంద సభ్యులు రీజనల్ ఫైర్ ఆఫీసర్లు వి.పాపయ్య, ఏ.జయప్రకాశ్, ఏఈ నాగరాజు, ఇన్స్పెక్టర్ విజయ్ ఆదిత్య ఉన్నారు.