మేడ్చల్, జనవరి21(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. దరఖాస్తు చేసుకుంటే చాలు రేషన్ కార్డు ఇస్తామన్నారు. పేర్లివ్వండి చాలు ఆత్మీయ భరోసా, రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. తీరా అమలు చేసే సమయానికి జాబితాలో పేర్లు లేవని చెబుతున్నారు. ఇదీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాపాలన తీరు. లబ్ధిదారుల ఎంపికలో, పథకాల మంజూరీలో ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టతకు రాలేదు. అందువల్లే ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చిన అర్హులైన చాలామంది పేర్లు ఎంపిక జాబితాలో లేవు. దీంతో మేడ్చల్ జిల్లాలో జరిగిన గ్రామసభల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రతిచోటా అధికారులను నిలదీశారు.
స్పష్టత కొరవడి..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మంగళవారం నాలుగు గ్యారెంటీల అమలు కోసం నిర్వహించిన గ్రామ, వార్డు సభలలో ఇందిరమ్మ, ఇళ్లు, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా ఎంపిక చేసిన జాబితాను ప్రజల మధ్య పేర్లను వినిపించారు. ఈ క్రమంలో జాబితాలో పేర్లు లేని వారు నిరసనలు తెలుపుతూ ఆందోళనకు దిగారు. తమ పేర్లు ఎందుకు లేవని తాము అర్హులం కాదా? అంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు మాట్లాడుతూ పథకాలకు సంబంధించి జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తులు చేసుకుంటే విచారణ జరిపి పథకాలను మంజూరు చేస్తామని చెప్పారు.
మరి ప్రజాపాలనలో దరఖాస్తులు ఎందుకు స్వీకరించారంటూ ప్రశ్నించారు. ఏడాది క్రితం పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్నామని, ఇప్పుడైనా ఎంపిక జాబితాలో తమ పేర్లు ఉంటాయని భావించిన దరఖాస్తుదారులకు నిరాశే ఎదురైంది. ఇందిరమ్మ ఇళ్ల, రేషన్ కార్డుల జారీలో అర్హూలలో ఎలాంటి ప్రమాణాలు పాటించారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తిరిగి దరఖాస్తులు చేసుకుంటే మళ్లీ పథకాలు ఎప్పుడు మంజూరు చేస్తారని దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 1.44 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా రేషన్ కార్డుల కోసం 1.22 లక్షల మంది ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు.
జిల్లా కలెక్టర్ చెప్పినా జాబితాలో పేరు లేదు
ఇందిరమ్మ ఇంటి పథకానికి అలియాబాద్‌కు చెందిన విలాసాగరం పద్మను ఎంపిక జాబితాలో చేర్చాలని స్వయంగా జిల్లా కలెక్టర్ గౌతమ్, ప్రత్యేక అధికారి శశాంక అధికారులకు ఆదేశించిన జాబితా పేరును చేర్చకపోడం విస్మయానికి గురి చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరులో భాగంగా ఈ నెల 17న అలియాబాద్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా కలెక్టర్ గౌతమ్, జిల్లా ప్రత్యేక అధికారి శశాంకలు పద్మ చెందిన ఇంటిని పరిశీలించి ఇందిరమ్మ ఇంటి పథకానికి అర్హురాలిగా ఎంపిక జాబితాలో చేర్చాలని ఎంపీడీవో మమతాబాయి, కార్యదర్శి శ్రీనివాస్‌లను ఆదేశించిన ఎంపిక జాబితాలో పేరు రాకపోవడం గమనార్హం. పద్మ పేరును జాబితా చేర్చకపోవడంపై ఎంపీడీవో మమతాబాయిని వివరణ కోరగా కలెక్టర్ ఆదేశించిన మాటా నిజమేనని ఒప్పుకున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా చేసిన సర్వేలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పద్మ భర్త ఇటీవల పక్షవాతంతో మరణించంగా 60 గజాల స్థలంలో రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నది.
ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలె
మా ఇంటికి ఏసారూ రాలేదు. లిస్టులో పేరు లేదంటున్నారు.ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలే. చిన్నపిల్లల్ని సాకలేకున్నాం.రేషన్కారటు వస్తుందనుకున్న. మల్ల ఇప్పుడు దరఖాస్తు చేసుకోమంటున్నరు.
– దుర్గ, ఇందిరానగర్ కాలనీ, బోడుప్పల్
కాంగ్రెసోళ్లకు ఇండ్లు ఇచ్చిండ్రు
నేను కూలీ పని చేసుకుంటా. ఇందిరమ్మ ఇంటి కోసం ధరఖాస్తు చేసుకున్న నాకు రాలేదు. ఇండ్లు ఉన్న కాంగ్రెసోళ్లకు ఇండ్లు వచ్చినట్లుగా ఆఫీసర్లు పేర్లు చెప్పిండ్రు. ఇది ఎక్కడి న్యాయం. ఈ పేర్లను మొత్తం రద్దు చేయాలి.కొత్తగా చూసి ఇండ్లు లేనోళ్లకు ఇయ్యాలె.
-కొడకండ్ల సత్తయ్య. ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, పోచారం మున్సిపాలిటీ.
ఇండ్లు ఎందుకియ్యరు?
రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పుడు లిస్టులో పేరులేదంటున్నరు.మేము కిరాయి ఇండ్లలో ఉంటున్నం. ఇందిరమ్మ ఇండ్లు ఎందుకియ్యరు. మల్లా ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి- అంటూ బోడుప్పల్ 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్యయాదవ్‌ను నిలదీస్తున్న మహిళలు…
ఓట్ల కోసమే హామీలు ఇచ్చిండ్రా
కొత్త ప్రభుత్వం వచ్చి ఆదుకుంటది అనుకున్న. ఏ ఆధారం లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్న. గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్‌తో జీవితం ఎల్లదీస్తున్న. అందరికీ ఇండ్లు ఇస్తామంటే దరఖాస్తు చేసుకున్న. ఈ రోజు జరిగిన వార్డు సభలో నా పేరు రాలేదు. చాలా బాధగా ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఫించన్లు పెరుగుతయ్. రేషన్ కార్డులు వస్తయంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తరంటే ఆశపడిన. కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చిండ్రని ఇప్పుడు తెలుస్తుంది. మాటలే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయదని తెలుస్తున్నది. ఇప్పటికైనా అర్హులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నా.
– సబేరున్నీసా, ఎన్‌ఎఫ్‌సీనగర్