495.75 కోట్ల పనులకు నేడు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నేడు బహదూర్‌పుర ఫ్లైఓవర్ ప్రారంభం
పాతనగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మౌలిక వసతులను గణనీయంగా పెంచుతున్నది. పాతనగరానికి కొత్త అందాన్నిస్తూ వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వారా అభివృద్ధి ఫలాలను అందిస్తున్నది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇప్పటికే ఏపీజే అబ్దుల్ కలాం, బైరామల్ గూడ ఫె్లైఓవర్లను ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా బహదూర్‌పుర ఫ్లైఓవర్ అందుబాటులోకి తెస్తున్నది. ఈ మేరకు మంగళవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాతనగరంలో పర్యటించనున్నారు. మొత్తం రూ 495.75కోట్ల విలువైన ఆరు వివిధ రకాల పనులకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : పాతనగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మౌలిక వసతులను గణనీయంగా పెంచుతూ వస్తున్నది. ఇందులో భాగంగానే పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పాతనగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రూ 495.75 కోట్ల విలువైన ఆరు పనులకు పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రులతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. పాతబస్తీలోని నిజాం కాలం నాటి చారిత్రక కట్టడాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చారిత్రక కట్టడాలకు పునరుద్ధరణ చేసి పాత వైభవాన్ని తీసుకువస్తున్నది. ఈ మేరకు సర్కారు సుమారు రూ.90.45కోట్లతో ఐదు పనులకు నిధులు మంజూరు చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కులీకుత్బుషా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఈ పనులు జరుగుతున్నాయి.
రూ.495.75కోట్ల పనులు.. వివరాలు..
రూ. 2.కోట్ల 55 లక్షలతో పూర్తిచేసిన మీరాలం చెరువులోని మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ప్రారంభిస్తారు. రూ. 108 కోట్లతో పూర్తి చేసిన బహదూర్‌పుర ఫె్లైఓవర్ను ప్రారంభిస్తారు. చార్మినార్ వద్ద మహబూబ్ చౌక్ (ముర్గీ చౌక్) పునరుద్ధరణకు రూ.36 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన, రూ. 21.90 కోట్ల అంచనా వ్యయంతో చార్మినార్ జోన్లో మీరాలం మండి అభివృద్ధి పనులు, రూ. 30 కోట్లతో చేపట్టే సర్దార్ మహల్ అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేస్తున్నారు. అంతేకాకుండా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో జలమండలి ద్వారా రూ. 297.30 కోట్ల అంచనా వ్యయంతో జోన్ 3 లో సివరేజీ నెట్వర్క్ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
పనుల వివరాలు
బహదూర్‌పుర ఫ్లై ఓవర్ ప్రారంభం..
హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ నగరంగా చేసేందుకు చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు విడుతల వారీగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్ఆర్డీపీ మొదటి దశలో చేపట్టిన 47 పనుల్లో సుమారు 30 పనులు పూర్తి కాగా, అందులో 13 ఫె్లైఓవర్లు, 7 అండర్ పాసులు ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా రూ.69 కోట్లతో బహదూర్‌పురలో 690 మీటర్ల పొడవునా నిర్మించిన మల్టీలెవల్ ఫ్లై ఓవర్‌ను మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీ మొదటి దశలో చేపట్టిన మొత్తం పనులలో ఇంకా కొన్ని మిగిలిపోయి, అసంపూర్తిగా ఉన్నాయి. ఈ పనులన్నింటినీ డిసెంబర్ చివరి వరకు పూర్తి చేసే ప్రక్రియలో అధికారులు ఒకొకటి పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
బహదూర్‌పుర ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో రవాణా సమయం తగ్గడం, ఇంధన కాలుష్య నియంత్రణ, బహదూర్‌పుర జంక్షన్లో సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుంది. 13 పిల్లర్స్, ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఆరాంఘర్ నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం ఈజీగా సాగడంతోపాటు సకాలంలో గమ్యస్థానం చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.