Telangana | ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సర్కారు.. ప్రజారోగ్యం కోసం అత్యుత్తమ కార్యక్రమాలను చేపడుతున్నది. ఇందులోభాగంగా చేపట్టిన ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కిట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇందులోభాగంగానే ఇంటి వద్దకే బీపీ, షుగర్ మందులు అందజేస్తున్నారు. ఇక త్వరలో న్యూట్రీషన్ కిట్లను సైతం నగరంలో అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గర్భిణుల డేటా సేకరణ, కిట్స్ పంపిణీ తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పీహెచ్‌సీలకు చేరుకున్న ఈ న్యూట్రీషన్ కిట్స్‌లో ఉండే బలవర్థక పోషకాలను స్వీకరించడం వల్ల గర్భిణులతో పాటు పుట్టబోయే బిడ్డ కూడా మరింత ఆరోగ్యంగా ఉంటారని అధికారులు పేర్కొన్నారు.
సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్ : నగరంలో పంపిణీ చేస్తున్న నాన్ కమ్యూనికెబుల్ డిసీజస్ కిట్స్ పంపిణీ విజయవంతంగా సాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా రోగుల ఇళ్లవద్దకే వెళ్లి ఆశా వర్కర్లు ఎన్సీడీ కిట్స్‌ను పంపిణీ చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి తెలిపారు. గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన పలు పీహెచ్సీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతేకాకుండా బోరబండ, ఎన్బీటీ నగర్, స్వరాజ్యనగర్ బస్తీల్లోని పలువురు రోగుల ఇళ్లవద్దకు వెళ్లి, ఎన్సీడీ కిట్స్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
సమయానికి మందులు అందుతున్నాయా, వేసుకుంటున్న మందులు సరిగ్గా పనిచేస్తున్నాయా తదితర విషయాలను రోగులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 16లక్షల 42వేల 712 మందిని స్క్రీనింగ్ చేశామని, అందులో లక్షా 96వేల 381మంది బీపీ రోగులు, లక్షా 8వేల 329మంది డయాబెటిక్ రోగులను గుర్తించామని వివరించారు. ఈ రోగులందరికీ ప్రతి నెలా ప్రత్యేక పౌచ్‌లతో ప్యాక్ చేసిన బీపీ, షుగర్ మందుల కిట్స్‌ను వారి ఇళ్లవద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్సీడీ కిట్స్ల్లో నెలరోజులకు సరిపడే మందులు ఉంటాయని వివరించారు. ఈ కిట్స్‌పై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.