మారేడ్పల్లి (హైదరాబాద్) : తెలంగాణ ప్రభుత్వానిది మాటలు కాదు.. చేతల ప్రభుత్వమని రాష్ట్ర పశుసంవర్థక,మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు. ఆదివారం కంటోన్మెంట్, సనత్నగర్ నియోజకవర్గాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి(Development), సంక్షేమమే(Welfare) ఎజెండాగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు.
అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో పోటీ పడాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు(Central Funds) తీసుకొని రావాలని బీజేపీ నాయకులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంలో ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు వెనుకాడబోదని స్పష్టం చేశారు. సనత్నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, బేగంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, లాస్యనందిత, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ సీజీఎం ప్రభు, బీఆర్ఎస్ నాయకులు నాగులు, రాములు, జయరాజ్, సి. సంతోష్ యాదవ్, అశోక్, రాము పాల్గొన్నారు.