Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. గంపెడాశలతో సిటీ ప్రాజెక్టుల కోసం నిధులు కోరితే, ఖాళీ చేతులను చూపి సమాధానం చెప్పింది. కనీసం భారీ ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కేంద్రం నిధులిస్తే గానీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టలేని పరిస్థితిలో రాష్ట్ర సర్కారు ఉంది. ఈ క్రమంలో నగరాభివృద్ధి కోసం కనీసం రూ. 20వేల కోట్లు కావాలంటూ రేవంత్ సర్కార్ చేసిన ప్రతిపాదనలను మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో నగరానికి తలమానికమైన ప్రాజెక్టులుగా కాంగ్రెస్ చెప్పుకుంటున్న మూసీ ప్రక్షాళన, మెట్రో రెండో దశ విస్తరణ ఆశలు నీరుగారేలా ఉన్నాయి.
కాగితాలపై ప్రణాళికలు..
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ కాగితాలపై ప్రణాళికలు రూపొందించి, నిధులు కోరుతుంటే… ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రేవంత్ సర్కారుకు షాకిచ్చింది. హైదరాబాద్ నగరానికి ఎంతో కీలకమైన రెండో దశ మెట్రో విషయంలో భారీ అశలు, అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించిన రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కేంద్ర అనుమతి కోసం ఫేస్-2 మెట్రో డీపీఆర్ వెళ్లిన… ఇప్పటికీ టెక్నికల్ స్క్య్రూటీ దశను కూడా చేరుకోలేదు. కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు కేటాయింపులు ఉంటాయని భావించినా… ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని తేలింది. రాష్ట్రం నుంచి హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కోరుతూ మూసీ ప్రక్షాళనకు రూ. 16వేల కోట్లు, మెట్రో ఫేస్-2 కోసం దాదాపు మరో రూ. 4230 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. వీటిలో ఏ ఒక్క ప్రతిపాదన కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రూ. 20వేల కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించాలంటూ చేసిన ప్రతిపాదనలకు విలువే లేకుండా పోయింది.
బడ్జెట్లో కేటాయింపుల్లేవు..
రాష్ర్టాల వారీగా కేంద్రం ఇచ్చే బడ్జెట్ కేటాయింపులను పక్కన పెడితే… ఆయా రాష్ర్టాలు చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరుతూ ప్రణాళికలను ప్రభుత్వాలు కేంద్రానికి పంపుతాయి. ఈసారి కూడా అదే తీరుగా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలంటూ చేసిన ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. కానీ అందులో ఏ ఒక్క ప్రతిపాదన కూడా లెక్కలోకి రాలేదు. కనీసం హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన మెట్రో ఫేస్-2 ప్రాజెక్టు అనుమతులతోపాటు, నిధులు కేటాయింపులు జరిగే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పటివరకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తామని హామీ ఇవ్వలేదు. ఇక లక్షన్నర కోట్లతో జీవనది మూసీ నదీని సుందరీకరణ చేస్తామంటూ రాష్ట్ర సర్కారు ఉత్సాహం చూపుతుంటే… అసలు ప్రస్తావనే లేనట్లు బడ్జెట్‌పై ప్రకటనలు చేసింది. గ్రేటర్ నుంచి ముగ్గురు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగరాభివృద్ధికి కీలకమైన మెట్రో విస్తరణ కోసం కేంద్రం నుంచి ప్రోత్సాహం ఉంటుందనీ భావించారు. కానీ డీపీఆర్ పరిశీలన దశలో ఉండటంతో, బడ్జెట్ కేటాయింపులకు అవకాశం లేకుండా పోయిందనీ నిపుణులు చెబుతున్నారు.
మెట్రోకూ మొండి చేతులే…
గడిచిన 12 ఏండ్ల కాలంగా హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన మెట్రో విస్తరణకు నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు అందుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి వెళ్లిన ఏ ఒక్క ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదు. కనీసం అడిగిన దానిలో సగం కూడా కేటాయింపులు చేయలేదు. దాదాపు రూ. 19వేల కోట్లతో మెట్రో ఫేస్-1 ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం కేవలం రూ. 1204 కోట్లు కేటాయిస్తే మిగిలిన మొత్తాన్ని పీపీపీ కింద ఎల్ అండ్ టీ సంస్థ రూ. 17974 కోట్లు వెచ్చించి ప్రాజెక్టు చేపట్టింది. అదేవిధంగా ఫేస్-2 కోసం నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు చేసినా, కేంద్రం నుంచి స్పందన లేదు. దీంతో దశాబ్ధ కాలంగా మెట్రో విస్తరణకు అవసరమైన నిధుల కేటాయింపుల్లో హైదరాబాద్‌కు అన్యాయమే జరుగుతున్నది. దాదాపు రూ. 24వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫేస్-2 ప్రాజెక్టు కోసం రూ. 4230 కోట్లను కేంద్రం కేటాయించాలని కోరింది. ఇప్పటికీ డీపీఆర్‌ను కూడా మోదీ సర్కారు ఆమోదించలేదు. కానీ చెన్నై, ఢిల్లీ మెట్రో విస్తరణ కోసం అడగకుండానే కేంద్రం నిధులను కేటాయించింది. ఎలాంటి ప్రతిపాదనలు లేకుండానే చెన్నై మెట్రో విస్తరణ కోసం రూ. 40వేల కోట్ల ఆర్థిక సాయంతో చేయూతనిచ్చింది. ఇదీ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 65శాతం మేర నిధులను కేంద్రమే తమిళనాడు సర్కారుకు కేటాయించింది. కానీ హైదరాబాద్ మెట్రో విషయంలో అనుకున్న తీరుగా నిధులను తీసుకురావడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా..సున్నా
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలున్నా.. రాష్ర్టానికి దక్కింది సున్నానే. బడ్జెట్లో తెలంగాణ ఊసే లేకపోవడం బాధాకరం. ప్రాంతీయ పార్టీల నుంచి ఎంపీలు ఉంటేనే రాష్ర్టాలకు న్యాయం జరుగుతుంది. ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉభయ సభల్లో గళమెత్తాలి. కేంద్రం జీడీపీకి 5.1 శాతం కాంట్రిబ్యూట్ చేస్తోన్న తెలంగాణ రాష్ట్రం మరోసారి మోసపోయింది. తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంతో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలైమెంది. బడ్జెట్‌కు కేవలం పది రోజుల ముందు రూ.40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు.
తెలంగాణపై కేంద్రం వివక్ష
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
వికసిత భారత్ నినాదం వల్లె వేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. జీడీపీలో 5.1 శాతం వాటాను ఇస్తున్న రాష్ర్టాన్ని మరోసారి మోసం చేశారు. కేంద్రం నుంచి నిధులు తెస్తారని నమ్మి.. 16 మంది ఎంపీలను గెలిపించిన రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు మొండి చెయ్యి చూపాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. ఇద్దరు కేంద్ర మంత్రులు బడ్జెట్లో తెలంగాణకు ఏం సాధించారో చెప్పాలి. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మలా సీతారామన్.. దేశమంటే కొన్ని రాష్ర్టాలోనోయ్ అన్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరంబడ్జెట్ కేవలం ఎన్నికలు జరగబోతున్న రాష్ర్టాల కోసమే ప్రవేశపెట్టినట్లు ఉంది.
మరోసారి తెలంగాణకు అన్యాయం
ఎమ్మెల్యే ముఠాగోపాల్
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి మరోసారి అన్యాయం జరిగింది. రానున్న ఎన్నికల కోసం బీహార్ రాష్ర్టానికి బంగారు పల్లెంలో వడ్డించి , తెలంగాణ మాత్రం తీవ్రంగా అన్యాయం చేశారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా.. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణ తెచ్చింది ఏమీ లేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లోక్ సభలో తెలంగాణ పార్టీ అయినా బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టాన్ని ప్రజలు గమనిస్తున్నారు. జాతీయ పార్టీలను గెలిసిస్తే తెలంగాణను నిండాముంచారు.