కనులపండువగా రాష్ట్ర అవతరణ వేడుకలు
ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాల ఆవిష్కరణ
తెలంగాణ అమరుల చిత్రపటాలకు నివాళి
శోభాయమానంగా పబ్లిక్‌గార్డెన్స్, అమరవీరుల స్థూపం
4 టిమ్స్ దవాఖానలతో సూపర్ స్పెషాలిటీ సేవలు
త్వరలో 60 బస్తీ దవాఖానల ఏర్పాటు
అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్
భాగ్యనగరం పులకించిపోయింది.. మువ్వన్నెల పతాకం మురిసిపోయింది.. ఆవిర్భావ సంబురం అంబరాన్నంటింది.. జై తెలంగాణ నినాదం హోరెత్తింది.. తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంది. రాష్ట్ర అవతరణ వేడుకలు గురువారం గ్రేటర్‌వ్యాప్తంగా కనులపండువగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ అమరుల చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. నాంపల్లి గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్‌తోపాటు గ్రేటర్ మంత్రులు నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. గ్రేటర్‌కు నాలుగువైపులా 4 టిమ్స్ దవాఖానల నిర్మాణంతో 4వేల సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయని, నిమ్స్‌లో 2 వేల పడకలు పెంచుతామని ప్రకటించారు. పేదల వైద్యం కోసం ఇప్పటికే 256 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయగా, త్వరలో 60 ప్రారంభిస్తామని తెలిపారు.
సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ఆరు దశాబ్దాల అస్తిత్వ పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్లలోనే అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరుకున్నది. ఉద్యమ నాయకుడే పాలనాధ్యక్షుడై పసిడి తెలంగాణే లక్ష్యంగా పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తయిన సందర్భంగా గ్రేటర్ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్ని అంటాయి. పబ్లిక్ గార్డెన్ నుంచి మొదలుకుని ప్రభుత్వ కార్యాలయాల వరకు జాతీయ పతాకం రెపరెపలాడింది.
గన్‌పార్క్ అమరవీరుల స్థూపం సాక్షిగా అమరులను స్మరించుకుని… స్వరాష్ట్ర పాలనలో సగర్వంగా ఎగిరిన పతాకంతో భాగ్యనగరం పులకించిపోయింది. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, పబ్లిక్ గార్డెన్లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌లను సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం వారిని ప్రగతి భవన్‌కు ఆహ్వానించి ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఇదిలా ఉంటే మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌లను సన్మానించిన అనంతరం వారిని ప్రగతి భవన్‌కు ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులు