సిటీబ్యూరో, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. క్షేత్ర స్థాయిలో తలెత్తే విద్యుత్ అంతరయాలను సత్వరమే పరిష్కరించే ప్యూజ్ ఆఫ్ కాల్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గ్రేటర్ పరిధిలో ఉన్న మొత్తం 10 సర్కిళ్లలోని ప్రతి సెక్షన్‌కు ఒక ప్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ ఉండేలా ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిన వెంటనే సత్వర మరమతులకు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన ఫ్యూజ్ ఆఫ్ కాల్ (ఎఫ్ఓసీ) వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరాలో వచ్చే ఫిర్యాదులను అతి తక్కువ కాలంలో పరిష్కరించేందుకు ఇప్పటి వరకు 213 ఎఫ్ఓసీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఎఫ్ఓసీ ఒక వాహనాన్ని (ఆటో రిక్షా) అందులో ఇద్దరు చొప్పున ఎలక్ట్రికల్ నిపుణులు ఉంచి, మరమ్మతు చేయిస్తున్నారు. వీటి పనితీరు మెరుగ్గా ఉండేందుకు ఆయా ఆటోరిక్షాల్లో జీపీఎస్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ చేసే వ్యవస్థను రూపొందించారు.
ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో 1912 కాల్ సెంటర్, ఎఫ్ఓసీల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. విద్యుత్ కంట్రోల్ రూమ్‌లో 74 మంది సుశిక్షత ఆపరేటర్లు 24/7 అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దడం జరిగిందని, ఈ అధునాతన కాల్ సెంటర్ ద్వారా ఒకేసారి 400 కాల్స్‌ను అందుకునే సామర్థ్యం ఉందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.