కవాడిగూడ: దోమలగూడలో కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాల ప్రాంభోత్సవానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను దళిత ఐక్యవేదిక నాయకులు అడ్డుకున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దళితులకు 14 శాతం రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలని, ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ దోమలగూడలో జీహెచ్ఎంసీ కవాడిగూడ, ముషీరాబాద్ సర్కిల్ కార్యాలయాల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట దళిత ఐక్య వేదిక నాయకులు నిరసన తెలిపారు.
గతంలో 150 డివిజన్లు ఉన్న సందర్భంలో దళితులకు 23 సీట్లు కేటాయించారని, ఇప్పుడు డివిజన్లు 300లకు పెంచిన సందర్భంగా ఎస్సీలకు 14 శాతం రిజర్వేషన్ల ప్రకారం దళితులకు మొత్తం 46 డివిజన్లు కేటాయించాలని ప్లకార్డులను ప్రదర్శించిన ఐక్య వేదిక నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అడ్డుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దళిత ఐక్య వేదిక నాయకులు గండి కృష్ణ, గజ్జల సూర్యనారాయణ, కె.వినయ్‌కుమార్, రూప్లావివేక్, మన్నె శ్రీధర్‌రావు, గడ్డం నవీన్, ఎ.యాదగిరి, స్వామి, శ్యామ్ తదితరులు మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో దళితులకు 46 డివిజన్లను తప్పక కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనట్లయితే దళితులందరినీ ఏకంచేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని దళిత ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు.