సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ శాఖ ఐదు చోట్ల ఫ్లై ఓవర్లు చేపట్టింది. ట్రాఫిక్, వాహన రద్దీ ఉపశమనానికి ఎస్ఆర్డీపీ దోహదపడుతుంది.
ప్రయాణ వేగాన్ని పెంచడం, సమయాన్ని తగ్గించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం, అంతేకాకుండా కనిష్ట భూసేకరణ నిధుల ఆధారంగా ఎస్ఆర్డీపీకి ప్రాధాన్యత ఇచ్చారు. 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు రూ.182 కోట్ల వ్యయంతో చేపట్టిన పీజేఆర్ (గచ్చిబౌలి శిల్పా లే అవుట్ ఫేజ్-2) ఫె్లైఓవర్ శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది, ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. కాగా ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో 23 వ ఫ్లై ఓవర్ కావడం విశేషం. 1.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 నిమిషాల 25 సెకన్లలో చేరుకోవచ్చు.
గచ్చిబౌలి శిల్పా లే అవుట్ ఫేజ్-2 ఫె్లైఓవర్ ను రూ.182.72 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ) కింద నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లతో ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తున్నది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫె్లైఓవర్లపై నిర్మించిన మూడవ స్థాయి నిర్మాణం. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫె్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫె్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్ 2 ఫె్లైఓవర్ నిర్మించారు. పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభం అయ్యాక కొండాపూర్ శిల్పా లే అవుట్ ప్రాంతాలలో వాహనాల వేగం పుంజుకోనుంది.
గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను ఈ ఫె్లైఓవర్ చాలా వరకు తగ్గిస్తుంది. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్ పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం ఆదాతో పాటు గంటల తరబడి ట్రాఫిక్‌లో చికుకోకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అకడి నుండి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళేందుకు గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు ఉంటుంది. గచ్చిబౌలి జంక్షన్ నుంచి నేరుగా ఈ ఫ్లై ఓవర్ పైకి ఎక్కి సాగిపోవచ్చు. దీని వల్ల గచ్చిబౌలి జంక్షన్ వద్ద కూడా ట్రాఫిక్ జాం తగ్గుతుంది గచ్చిబౌలి ఔటర్ నుంచి కొండాపూర్ రోడ్డు రూట్లో రోజూ 50 నుంచి 50 నుంచి 60 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, ట్రాఫిక్ జాం కారణంగా సుమారు 3007 లీటర్ల వరకు ఇంధనం వృథా అవుతుందని అధికారులు తెలిపారు. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నెలకు దాదాపు రూ. 90 లక్షల చొప్పున ఏటా రూ. 11కోట్ల వరకు ఇంధనం ఖర్చు ఆదా అవుతుందని చెబుతున్నారు.
పీజేఆర్ ఫ్లై ఓవర్ నగరంలోని అతిపెద్ద ఫ్లై ఓవర్‌గా ఒకటిగా స్థానాన్ని దక్కించుకోనుంది. సిటీలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే 4 లేన్లతో 11.66 కి.మీలతో మొదటి స్థానంలో నిలవగా, ఆరాంఘర్ ఫ్లై ఓవర్ 6 లేన్లతో 4.08 కి.మీతో రెండవ స్థానంలో ఉంది. కొత్తగూడ ఫ్లై ఓవర్ 4 లేన్లతో 3 కి.మీ పొడవుతో మూడవ స్థానంలో ఉంది. షేక్‌పేట ఫ్లై ఓవర్ ఆరు లేన్లతో 2.71 కి.మీ (నాలుగవ స్థానం), శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ ఫేజ్-1 నాలుగు లేన్లతో 1.75 కి.మీ ఐదవ స్థానంలో ఉండగా, ఓవైసీ మిథాని ఫ్లై ఓవర్మూడు లేన్లతో 1.40 కి.మీ ఆరవ స్థానం, ఆ తర్వాత శిల్పా లే అవుట్ ఫేజ్-2 పీజేఆర్ ఫ్లై ఓవర్ 1.20 కిలోమీటర్లతో ఏడో స్థానంలో నిలిచింది. దీని తర్వాత 6 లేన్లతో బాలానగర్ ఫ్లై ఓవర్ 1.13 కి.మీతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.
-కొండాపూర్ నుంచి గచ్చిబౌలి ఔటర్ వరకు
1.2 కిలోమీటర్లు, 6 లేన్ల నిర్మాణం
-ప్రాజెక్టు వ్యయం రూ.182 కోట్లు
-పనుల ప్రారంభ తేదీ -2022 మార్చి 1 పూర్తి 2025 జూన్ 15
ఎస్ఆర్డీపీలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం సంతోషంగా, గర్వంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 42 ప్రాజెక్టులలో బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ప్రాజెక్టులను పూర్తి చేసిందన్నారు. పురోగతిలో ఉన్న ఆరు ప్రాజెక్టులు 2024 డిసెంబరు నెలాఖరులో అందుబాటులోకి రావాల్సి ఉండేదని చెప్పారు. సౌకర్యవంతమైన ప్రయాణానికి బాటలు వేసినందుకు ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైదరాబాదీల తరపున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.