అవి ఆకుపచ్చని పంటలతో కళకళలాడే గ్రామాలు.. పైగా జంట జలాశయాల కోసం ఏర్పాటైన జీవో 111 పరిధిలోనివి… అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా.. చట్టబద్ధత కలిగిన అనుమతులు లభించవు. ఏ బ్యాంకు రూపాయి రుణం మంజూరు చేయదు. కుటుంబ విస్తరణలో భాగంగా ఇంటి నిర్మాణాలు చేపడితే..వందకు వంద శాతం పన్ను చెల్లించాలి. ఏ గ్రామంలోనూ గడిచిన రెండేండ్లుగా విద్యుత్ మీటర్లను మంజూరు చేయడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఖానాపూర్, వట్టినాగులపల్లి, జన్వాడ, మిర్జాగూడ గ్రామాలను సర్కారు జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. అక్కడి ప్రజలను దిక్కుతోచని స్థితిలో పడేసింది. దీంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక ఆ గ్రామాల ప్రజలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే తమ బతుకులు అంతంతగా సాగుతుంటే.. సర్కారు కనీసం తమ స్థితిగతులను పట్టించుకోకుండా ఏకంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ‘మా గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా మాపై మరింత అదనపు భారం మోపుతున్నారే తప్ప.. మాకు ఎలాంటి ప్రయోజనం లేదు’ అని ప్రజలు మండిపడుతున్నారు.
గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాలు ఐదేళ్ల క్రితం నార్సింగి మున్సిపాలిటీలో విలీనం కాగా.. ఈ ఏడాది ఆరుమాసాల క్రితం జన్వాడ, మీర్జాగూడ గ్రామాలను నార్సింగి మున్సిపాలిటీలో విలీనం చేశారు. అనంతరం ఇటీవల హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో ఈ నాలుగు గ్రామాలను విలీనం చేస్తూ సర్కార్ గెజిట్‌లో ఆమోద ముద్రవేసింది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామాలపై పిడుగు పడ్డైట్లెయింది. అప్పటికే ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాలకు చెందిన చాలామంది మున్సిపాలిటీలో విలీనం అయిన తర్వాత పెరిగిన పన్నుల భారం, ఇబ్బందులను తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఇదిలావుండగానే జన్వాడ, మిర్జాగూడ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన ఆరుమాసాలకే జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఆ ప్రాంత ప్రజలు కూడా పన్నుల భారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతంత బతుకులపై అధికభారం
111 జీవో పరిధిలో మా బతుకులు అంతంతగా సాగుతుంటే సర్కార్ కనీసం మా స్థితిగతులను పట్టించుకోకుండా ఏకంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడమేమిటనీ ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జంట జలాశయాల పరిరక్షణ కోసం ఏర్పాటైయిన జీవో 111 పరిధిలోని గ్రామాలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో విలీనం చేయడం చట్టవిరుద్ధమని అన్ని రాజకీయ పార్టీల నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఖానాపూర్, వట్టినాగులపల్లి, మేఘనగడ్డ, మిర్జాగూడ, జనవాడ గ్రామాలు జీవో 111 పరిధిలోకి వస్తాయి.
ఈ గ్రామాలలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టినా వాటికి అనుమతులు మంజూరు చెయ్యరు..పైగా అన్ని అక్రమాలే అని అధికారులు నిర్థారిస్తున్నారు..ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అసెస్మెంట్ల పేరిట వందశాతం పెనాల్టీలు వసూల్ చేస్తున్నారు. పైన తెలిపిన ఏ గ్రామంలోనూ గడిచిన రెండేళ్లుగా విద్యుత్ మీటర్లను మంజూరుచేయడం లేదంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదెక్కడి అన్యాయం, మాపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తాజాగా మా గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా మరింత అదనపు భారం మోపుతున్నారే తప్ప మాకు ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోకుండా అధికారులు అకారణంగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ఎంతవరకు సమంజసమని ఆ నాలుగు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అడుగుదూరంలో వందకోట్లకు ఎకరం
అడుగుదూరంలో ఉన్న కోకాపేటలో రూ.100 కోట్లకు ఎకరం పలికితే.. 111 జీవో కారణంగా ఆయా గ్రామాలలో మాత్రం రూ.10 కోట్లకే ఎకరం భూమి ధర పలుకుతుందని జన్వాడ, మిర్జాగూడ, ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఏదైనా నిర్మాణం చేపడితే దానికి అక్రమ వసూళ్లు…వందశాతం పెనాల్టీలు..ఏ శాఖలోనైనా లంచాలు ఇవ్వనిదే ఇక్కడ పనులు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. కేవలం సంపన్న వర్గాల విలాసవంతమైన ఫాంహౌస్‌లు, రిసార్టులు, పెద్ద పెద్ద కన్వెన్షన్లకు మాత్రం అధికారులు దగ్గరుండి నిర్మాణాలు చేసుకోనిస్తున్నారని… సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇక్కడ జీవించే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడుతన్నారు.
జీహెచ్ఎంసీలో విలీనం చేసిన అనంతరం షరతులు లేకుండా నిర్మాణ అనుమతుల్లో సడళింపులు ఇస్తారా? అలాగే ఇక్కడి నిర్మాణాలకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరుచేసే వీలు కల్పిస్తారా? అని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 111 జీవోలో సడలింపులు తీసుకువచ్చి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టేలా వెసులుబాటు కల్పిస్తే.. ఈ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలిపితే మాకేమీ అభ్యంతరం లేదంటునారు. తమ పూర్వీకుల నాటి నుంచి ఇవే గ్రామాలలో జీవిస్తున్న మాపై సర్కార్ ఇలా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జంట జలాశయాలకు ఎగువన 10 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని 111 జీవో ప్రకారం న్యాయస్థానంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయాలను సైతం అధికారులు పరిగణలోకి తీసుకోకుండా మా గ్రామాలను జీహెచ్ఎంసీలోకి ఏవిధంగా విలీనం చేశారంటూ ప్రజలు వాపోతున్నారు.

న్యాయస్థానంలో వివాదాలు ఉండగా విలీనం సరికాదు
జంట జలాశయాల పరిరక్షణ కోసం ఏర్పాటైన జీవో 111 పరిధిలోని గ్రామాలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో విలీనం చేయడం చట్టవిరుద్దమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నార్సింగి సింగిల్‌విండో చైర్మన్ తోలుకట్టె కృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన నార్సింగి సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖానాపూర్, వట్టినాగులపల్లి, మేఘనగడ్డ, మిర్జాగూడ, జనవాడ గ్రామాలు జీవో 111 పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అధికారులు వాటికి అనుమతులు మంజూరు చెయ్యరు. పైగా అన్నీ అక్రమాలే అని అధికారులు నిర్థారిస్తున్నారు..ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అసెస్మెంట్ల పేరిట వందశాతం పెనాల్టీలు వసూల్ చేస్తున్నారు. ఏ గ్రామంలోనూ గడిచిన రెండేళ్లుగా విద్యుత్ మీటర్లను మంజూరుచేయడం లేదు. వీటన్నిటిపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రయను ముందుకు తీసుకెళ్లాలి.
111 జీవోను సవరించాలి
ఆకుపచ్చని పంటలతో కళకళలాడే గ్రామాలను జీహెచ్ఎంసీ విలీనం చేయడం సరికాదు. 111జీవో ఉండటంతో జన్వాడ, మిర్జాగూడ, ఖానాపూర్, వట్టినాగులపల్లి గ్రామాలలో ఎలాంటి నిర్మాణాలకు తావులేదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. 111 జీవో పరిధిని సడలించిన తర్వాతనే జీహెచ్ఎంసీలో వాటిని విలీనం చేయాలి. అలాగే పట్టణ సౌకర్యాలపై ప్రజ ల్లో అవగాహన కల్పిస్తూ అప్‌గ్రేడ్ పద్ధతిలో విలీనం చేయాలి. ఇక్కడి ప్రజల భూములు, ఆస్తులపై కబ్యాంకులు రుణాలు మంజూరు చేసే లా చూడాలి.
-కే విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, నార్సింగి
బహుళ అంతస్తులపై స్పష్టతనివ్వాలి
నార్సింగి సర్కిల్ పరిధిలోని ఖానాపూర్, వట్టినాగులపల్లి, మిర్జాగూడ, జన్వాడ గ్రామాలలో జీప్లస్‌టు నిర్మాణం చేపడితే వందశాతం పెనాల్టీలతో పన్నులు వసూల్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగలరా? వాటిపై స్పష్టతనివ్వాలి. మా ఆస్తులకు కూడా కోకాపేట స్థాయిలో విలువ పెంచాలి. అప్పుడు జీహెచ్ఎంసీలో విలీనాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తారు. సర్కార్ ఆదిశగా చర్యలు తీసుకోవాలి.
– రాచూరి ఆయిలయ్య, మాజీ సర్పంచ్, జన్వాడ