సిటీబ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 రోజులకు నాంపల్లి గ్రౌండ్లో గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్‌తో సీఎం సమావేశం ఏర్పాటు చేసి డ్రైవర్లకు వాహన ఆధారిత యాప్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో డ్రైవరన్నలు రోడ్డెక్కారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నగర వ్యాప్తంగా ‘నో ఏసీ’ నిరసన చేపడుతున్నారు. క్యాబ్ డ్రైవర్లు అందరూ నో ఏసీ నిరసనలో పాల్గొంటున్నట్టు తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ ప్రకటించింది. ‘అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ నెరవేర్చలేదు’. అని తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ అన్నారు.