హిమాయత్‌నగర్, డిసెంబర్ 4 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోస పూరిత వైఖరిని అవలంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9న ఖైర తాబాద్లోని రవాణా కార్యాలయం ముట్టడితో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు తెలిపారు. గురువారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి కార్యాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెంకటేశం(ఏఐటీయూసీ), నేతలు రామ్‌కిషన్ (బీఆర్టీయూ), సత్తిరెడ్డి (టీఏడీఎస్), ప్రవీణ్(టీయూసీఐ), ఎస్. దయానంద్(ఐఎన్టీయూసీ), రాంరెడ్డి, (ఐఎఫ్టీయూసీ), యాదగిరి (టీఎన్టీయూసీ), అశోక్, కృష్ణ, నరసింహ (ఏఐటీయూసీ) మాట్లాడారు.
ప్రజాదనాన్ని లూటీ చేసేందుకే గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సమస్యలకు సంబంధించిన 12 డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క హామీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఆటో డ్రైవర్లు పేదరికంలో మగ్గుతున్నారని, ఇంటి అద్దెలు,ఆటో కిరాయిలు కట్టలేక కొందరు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటి వరకు 169 మంది ఆటో డ్రైవర్లు మరణించారని, వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
రాష్ట్రంలో ఒలా, ఉబర్,ర్యాపిడో వంటి సేవలను నిలిపివేసి వాటి స్థానంలో ప్రభుత్వమే ఒక కొత్త యాప్ తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్ల సామాజిక భద్రత కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం అందించి,రూ.5లక్షల ప్రమాద బీమా, ఇండ్లు లేని ఆటో డ్రైవర్లకు స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు..