సిటీబ్యూరో, నవంబరు 30 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, యాకుత్ఫుర నియోజకవర్గంలో చిన్నా చితక సంఘటనలు మినహా అన్నీ చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 20వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనగా..వేకువ జాము నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా శ్రమించారు. అధికారులందరూ సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులు మూడు దఫాల్లో విధులు ఎలా నిర్వహించాలన్న అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
మోడల్ పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ముందుగా ఖరారు చేసిన రూట్లలో గురువారం రాత్రి సమయానికి ఈవీఎంలను పకడ్బందీగా స్ట్రాంగ్ రూములకు చేర్చారు. స్ట్రాంగ్ రూముల వద్ద 144 సెక్షన్‌తోపాటు మూడంచెల భద్రత విధానాన్ని ఏర్పాటు చేశారు. తొలి అంచెలో పారా మిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, మూడో దశలో సివిల్ పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు. ఈ నెల 3న జిల్లాలోని ఏడు చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
పోలింగ్‌కు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు మందకొడిగా సాగారు. మధ్యాహ్నం తర్వాత ఓటర్లు భారీ పోటెత్తారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ల ఉన్న వారందరికీ అవకాశం కల్పించగా, కొన్ని చోట్ల రాత్రి 8 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరిగింది. విద్యావంతులు అధిక సంఖ్యలో పోలింగ్‌కు దూరంగా ఉండగా..బస్తీ వాసులు భారీ తరలివచ్చారు. పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి , జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.