బంజారాహిల్స్, జూలై 29 : తెలుగు ఫిలిం చాంబర్లో తెలంగాణ సెగ రాజుకుంది. చాంబర్లో తెలంగాణకు చెందిన సినీ కళాకారులకు ప్రాధాన్యత లేకపోవడాన్ని ఖండిస్తూ తెలంగాణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారు. చాంబర్లోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ ఉద్యమకారులను అడ్డుకొని వారిని చాంబర్ నుంచి బయటకు నెట్టివేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి నేతృత్వంలో పలువురు ఉద్యమకారులు ఆంధ్రా గోబ్యాక్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. చాంబర్ గోడలపై ఉన్న ఫోటోల విషయంలో స్పష్టత ఇవ్వాలని, తెలంగాణ సినీ లెజండ్ పైడి జయరాజ్ ఫొటో చిన్నగా ఉండడంతో పాటు ఓ హిరోయిన్ కింద ప్రాధాన్యత లేకుండా ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డి ఫోటో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్వాదం పెరిగి తోపులాటలు షురువై పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ కళాకారులు, రచయితలను కించపరిచే విధంగా తెలుగు ఫిలించాంబర్ వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే తప్పును సరిదిద్దుకోకుండా ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.