శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 5 : శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి వెళ్లాల్సిన అలెన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (91877) బుధవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే.. చివరి నిమిషంలో ఎయిర్‌లైన్స్ అధికారులు విమానంలో సాంకేతికలోపం తలెత్తినట్లు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఎయిర్‌పోర్టులోకి చేరుకున్న 40 మంది ప్రయాణికులు దాదాపు 8.30 గంటల వరకు వేచిచూశారు. ఎయిర్‌లైన్స్ అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. తిరుమల దర్శనం కోసం వెళ్తున్న ప్రయాణికులకు తిరుమల దర్శనం సమయం ముగియడంతో ఎయిర్‌లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాన్ని పూర్తిగా రద్దు చేశారా? లేక ఏదైనా ఏర్పాట్లు చేశారా? అనే విషయంపై ఎయిర్‌పోర్టు అధికారులను వివరణ కోరే ప్రయత్నం చేయగా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.