మాదాపూర్, జనవరి 29: విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు ఓ ఐటీ ఉద్యోగి. ఈ నేపథ్యంలో ముసుగుతో స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి ఆమె వద్ద నుంచి రెండు బంగారు గాజులను అపహరించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితున్ని అరెస్ట్ చేశారు.
మాదాపూర్ క్రైం ఇన్స్పెక్టర్ విజయ్ నాయక్ తెలిపిన ప్రకారం.. కడప జిల్లాకు చెందిన కాళహస్పి హరికృష్ణ (35) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం నిమిత్తం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 25వ తేదీన ఉదయం 11:15 గంటల సమయంలో మాదాపూర్ చందానాయక్ తండాలోని రోడ్డు నం.34లోని దేవి హోమ్స్‌లో తన కంపెనీలో పనిచేస్తున్న సహోద్యోగి మణికంఠ నివాసం ఉంటున్నాడు.
మణికంఠ ఇంట్లోలేని సమయంలో ముసుగు వేసుకొని ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. మణికంఠ ఇంట్లో అతడి భార్య, 18 నెలల కుమార్తె ఉండగా.. అతడి భార్యని కత్తితో బెదిరించడంతోపాటు మెను గాయపరిచి రెండు బంగారు గాజులను అపహరించి వెళ్లాడు. దీంతో మణికంఠ మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా దొంగతనానికి పాల్పడిన హరికృష్ణను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నేరం చేసినట్లు అంగీకరించాడు.
దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 20 గ్రాముల రెండు బంగారు గాజులు, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనం(టీజి 08 3585), కత్తి 1, ఐక్యూ స్మార్ట్ ఫోన్ 1లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60వేల వరకు ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. హరికృష్ణ భార్యతో విబేధాలు కావడంతో విడాకులు తీసుకున్నాడని, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి డబ్బులు సరిపోక దొంగతనాలు, దోపిడీలకు పాల్పపడినట్లుగా పోలీసులు తెలిపారు.