సిటీబ్యూరో: పోస్టింగ్ ఇచ్చిన నాలుగు రోజులకే బదిలీ చేస్తామంటూ డీఈఓ నుంచి ఫోన్లు వస్తుండటంతో కొత్తగా పోస్టింగ్‌ల్లో చేరిన టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టుమని వారం గడవక ముందే బదిలీపై మరో ప్రాంతంలో రిపోర్ట్ చేయాలని డీఈఓ కార్యాలయం నుంచి పలువురికి ఫోన్లు వస్తున్నాయి. సోమవారం కొందరిని కార్యాలయానికి సైతం డీఈఓ పిలిపించుకుని మరో ప్రాంతానికి వెళ్లాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
దీంతో వాళ్లంతా ఉపాధ్యాయ సంఘాలను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. కుటుంబంతో కలిసి పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతంలో ఇండ్లు తీసుకునే పనిలో వారుంటే ఇప్పుడు అకస్మాత్తుగా వెనక్కి పిలిచి.. మరో ప్రాంతానికి వెళ్లాలంటూ డీఈఓ చెబుతున్నారని ఓ మహిళా టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో టీచర్‌ను పిలిపించి లంగర్‌హౌజ్ నుంచి ఆసిఫ్‌నగర్‌లో పోస్టు కేటాయిస్తున్నట్టు డీఈఓ ఆదేశాలివ్వడంపై సదరు టీచర్ నిరసన వ్యక్తం చేశారు.
డీఎస్సీ కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయనడానికి ఆకస్మిక బదిలీ ప్రక్రియనే కారణమని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఈనెల 22న జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా పారదర్శకంగా జరగలేదని ఆరోపించాయి. అవసరం ఉన్న దగ్గర టీచర్లను కేటాయించకుండా అవసరం లేని చోట టీచర్లను కేటాయించారు. బహదూర్‌పుర-2 మండలంలోని జీపీఎస్ నంది ముసలాయిగూడ పాఠశాలలో 68 మంది విద్యార్థులు ఉండగా, త్వరలో రిటైర్డ్ కాబోయే ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇంకా ఇద్దరు టీచర్స్ అవసరం ఉంది. కానీ ఒక్క పోస్టు కూడా కేటాయించలేదు.
వెకెన్సీలకు ప్రాధాన్యతనివ్వకుండా డీఈఓ పోస్టింగ్‌లు కేటాయించారు. గులాబ్ సింగ్‌లో 40 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ కూడా లేరని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. జీపీఎస్ సాయిబాబానగర్ పాఠశాలలో 160 మంది విద్యార్థులకు ఒక హెచ్ఎం, 5గురు ఎస్జీటీలు ఉన్నప్పటికీ అవసరం లేకపోయినా అదనపు పోస్టు చూపించారంటూ టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌సుందర్ ఆరోపించారు. ఇలా నగరంలో చాలా స్కూల్లో పరిస్థితి ఇలానే ఉండటం బాధాకరమని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీఈఓ రోహిణి అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. గతంలో విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు డీఈఓ రోహిణికి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి షోకాజ్ నోటీసులు సైతం జారీ చేయడం తెలిసిందే. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన టీచర్ల భర్తీలోనూ అదే అలసత్వం ప్రదర్శించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో డీఎస్సీ -2024లో 584 మంది అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారు. 878 పోస్టులకు గాను కోర్టు కేసులు, రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థుల కొరత, ఇన్ సర్వీస్ తదితర కారణాలతో 262 పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి.
మిగతా 616 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ ధ్రువీకరణ పత్రాల రీ వెరిఫికేషన్‌తో 32 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు నిలిపి వేసిన విషయం తెలిసిందే. నియామక పత్రాలు అందుకున్న వారిలో 386 ఎస్జీటీ, 107 ఎస్ఏ, 91 ఎల్పీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు లభించాయి. వీరిని అవసరమున్న చోట భర్తీ చేయకుండా ఇష్టానుసారంగా ప్రక్రియ పూర్తి చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు బదిలీకి ఒత్తిడి తీసుకొస్తుండటం విశేషం.