Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 4: రెస్టారెంట్లో టీ మాస్టర్‌గా చేరాడు. 15 రోజులు గడవకముందే కౌంటర్లో డబ్బులు తస్కరించి ఉడాయించాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రం బిదినియా గ్రామానికి చెందిన పవన్ యాదవ్ అనే వ్యక్తి శ్రీకృష్ణ నగర్‌లోని అమృతం అడ్డా రెస్టారెంట్లో గత నెల 21న టీ మాస్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ. 34000 జీతానికి కుదిరాడు. వారం రోజుల క్రితం రూ. 3000 అడ్వాన్స్ తీసుకున్నాడు. కాగా రెండు రోజుల తర్వాత మరో రూ. 7000 అడ్వాన్స్ ఇవ్వాలని పవన్ యాదవ్ మేనేజర్ సలీంను కోరాడు. పదిరోజులు ఆగిన తర్వాత ఇస్తానని అప్పటిదాకా ఆగాలని చెప్పాడు.
రంజాన్ సందర్భంగా సలీం ఊరికి వెళ్ళాడు. వెళ్లే సమయంలో రెస్టారెంట్లో పని చేస్తున్న ఇద్దరు సిబ్బందికి రూ. 7000 చొప్పున ఇవ్వాలని పవన్ యాదవ్‌కు అప్పజెప్పాడు. కాగా గురువారం సాయంత్రం కౌంటర్లో ఉన్న రూ.15 వేలతో పాటు ఇతర సిబ్బందికి ఇవ్వాల్సిన రూ. 14 వేలతో పవన్ యాదవ్ ఉడాయించాడు. ఈ మేరకు మేనేజర్ సలీం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.